15, జులై 2016, శుక్రవారం

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

‘దేశానికి ప్రత్యేకంగా రైల్వేబడ్జెట్‌ ఎందుకు’ అన్న ప్రశ్న ఈనాటిది కాదు. రెండున్నర దశాబ్దాల సంకీర్ణ రాజకీయాల శకంలో స్వార్థ, సంకుచిత అజెండాలతో చెలరేగిపోయిన కొద్దిబుద్ధుల పెద్దల వికృత విన్యాసాలవల్లే భారతీయ రైల్వే పెనుసంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పకతప్పదు. ప్రయాణికుల సేవల విభాగంలో రైల్వేల రాబడి నష్టం రూ.34వేల కోట్లకు చేరిందని, పెండింగులో ఉన్న 458 ప్రాజెక్టుల పరిపూర్తికి దాదాపు నాలుగు లక్షల 83వేలకోట్ల రూపాయలు కావాలని సర్కారీ గణాంకాలే చాటుతున్నాయి. నూరు పైసల సంపాదన కోసం నూట పది పైసలు ఖర్చు చేయాల్సిన దురవస్థలో కూరుకుపోయిన భారతీయ రైల్వేకు విస్తృత సంస్కరణల చికిత్స జరిపి తీరాల్సిందేనని పలు నిపుణుల సంఘాలు ఇప్పటికే సూచించాయి. ‘నీతి ఆయోగ్‌’ సభ్యులు బిబేక్‌ దేబ్రాయ్‌, కిశోర్‌ దేశాయ్‌ల అధ్యయనం- ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టే సంప్రదాయానికి దశలవారీగా చరమగీతం పాడాలని సూచించింది. 20 పేజీల ఆ సూచన పత్రంపై సురేశ్‌ ప్రభు సారథ్యంలోని రైల్వే మంత్రిత్వశాఖ సైతం సానుకూలంగా స్పందించడం తాజా పరిణామం. రైల్వేను వాణిజ్యపరంగా నిర్వహించాలంటే, సంబంధిత నిర్ణయాలను రైల్వేబోర్డుకు వదిలెయ్యాలిగాని, ఆ పని పార్లమెంటుకు అప్పగించడం సరికాదన్నది బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ నిశ్చితాభిప్రాయం. రైల్వే బడ్జెట్‌లో ఉండే పది ప్రధాన విభాగాల్లో కేవలం రెండింటికే పార్లమెంటు ఆమోదం అవసరమవుతుందంటూ వాటిని సాధారణ బడ్జెట్‌లో చేర్చడం ద్వారా దశాబ్దాల ‘ప్రత్యేక సంప్రదాయానికి’ తెరదించవచ్చునన్నది మన్నికైన సూచన. సుభద్ర ప్రజారవాణా వ్యవస్థగా రైల్వేలను పారదర్శకత- జవాబుదారీతనాలనే పట్టాలపైకి ఎక్కించేందుకు పట్టుదలతో కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వం- జాతి మనుగడకు మూలాధారమైన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌తో కొత్త వూపిరులూదాల్సిన కీలక తరుణం ఇదే కదా!
దేనినైనా వాయిదా వేయవచ్చేమోగాని వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాల్లో మాత్రం జాగు చేయకూడదనేవారు భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ! ప్రపంచీకరణ పేరిట ఆర్థిక సంస్కరణల్ని మొదలుపెట్టి ఇప్పటికి పాతికేళ్లయినా, భారత వ్యవసాయ రంగంలో తీరైన సంస్కరణలు అయిపూ ఆజా లేనేలేవు! ప్రకృతి విపత్తుల్లో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం అందించాల్సిందేనని జాతీయ కమిటీ అధ్యక్షుడిగా సిఫార్సు చేసిన భూపీందర్‌ సింగ్‌ హుడా (అప్పటి హరియాణా ముఖ్యమంత్రి)- తన రాష్ట్రంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న అన్నదాతల్లో కొందరికి వంద రూపాయలే పరిహారం అందించిన ఘనుడు. వాగ్దానాలకు కార్యాచరణకు పొంతనలేని ఈ తరహా ధోరణి వల్లే యూపీఏ పదేళ్ల జమానాలో అన్నదాతల ఆత్మహత్యలు ఇంతలంతలైపోగా మొత్తం రెండు దశాబ్దాల్లో మూడు లక్షల మందికి పైగా రైతులు బలవన్మరణాలపాలయ్యారు. ఆ విషాదకర చరిత్రకు ముగింపు పలకాల్సిన గురుతర బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉంది. సాగును బాగుచేసుకొనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలంటూ ‘కృషి ఉన్నతి మేళా’లో రైతులకు ఉద్బోధించిన మోదీ- వేటికవిగా వివిధ రైతు శ్రేయస్సాధక పథకాల్ని అమలు చేస్తున్నా, జాతీయ స్థాయి సర్వసమగ్ర వ్యూహానికి అవి సమర్థ ప్రత్యామ్నాయం కాలేవు. నూటపాతిక పైగా విభిన్న వాతావరణ జోన్లు, 85 శాతం దాకా చిన్న సన్నకారు కమతాలు, ఖర్చులకు రాబడికి లంగరందని సేద్యపద్ధతులు, అన్నింటికీ మించి 55 శాతం జనావళికి ఇప్పటికీ భూమే భుక్తిగా ఉందన్న వాస్తవం- కేంద్రస్థాయిలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ఉండి తీరాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. 2022 నాటికి దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ ప్రభుత్వ సంకల్పం సాకారం కావాలన్నా అలాంటి విప్లవాత్మక చొరవతోనే సాధ్యపడుతుంది!
రైతుల ప్రయోజనాలను, సేద్య ప్రగతిని, గ్రామీణాభివృద్ధిని వేర్వేరుగా పరిగణించినన్నాళ్లు నికర పురోగతి ఎండమావినే తలపిస్తుందని మొన్న జనవరిలో ప్రధాని మోదీ చెప్పింది అక్షరసత్యం. ఆ సమగ్ర దృక్పథం కొరవడే దేశ వ్యవసాయరంగం ఈసురోమంటోందన్నది పచ్చి నిజం. వ్యవసాయార్థికం జాతి ఆహార భద్రతకే కాదు, స్వావలంబన, సార్వభౌమాధికారాలకూ అత్యంత కీలకమైనది. ఆ వాస్తవాన్ని గుర్తించిన చైనా లాంటి పలు దేశాలు- శాస్త్ర పరిశోధనల్ని పొలంగట్లకు చేర్చి అద్భుత దిగుబడులు సాధించడంతోపాటు రైతు శ్రేయానికీ పూచీ పడుతున్నాయి. చైనా ఒక హెక్టారు సాగుభూమిలో వరి 6,548 కిలోలు, పప్పు ధాన్యాలు 1,567 కిలోలు పండిస్తుంటే, భారత్‌లో వాటి ఉత్పాదకత వరసగా 3,264 కిలోలు, 694 కిలోలకు పరిమితమైపోయింది. ఈ మందభాగ్యానికి కొరగాని మద్దతు ధరల దౌర్భాగ్యం జతపడి బడుగు రైతుకు ఉరితాళ్లు పేనుతున్నాయి. యువతరాన్నీ సూదంటు రాయిలా ఆకర్షించేలా శాస్త్రీయ సేద్యం వూపందుకోవాలని డాక్టర్‌ స్వామినాథన్‌ ఆకాంక్షిస్తే, నష్టాల సాగు చెయ్యలేమంటూ లక్షలాది రైతులు కాడీమేడీ వదిలేస్తున్న దురవస్థ- దిగుమతులు తప్ప గత్యంతరం లేని దిశగా దేశాన్ని ఈడ్చుకుపోతోంది. దశాబ్దాల స్వయంకృతాపరాధాలకు విరుగుడుగా ప్రత్యేక బడ్జెట్‌తో విధాన సేద్యాన్ని మోదీ సర్కారు కొత్తపుంతలు తొక్కించాలి. దేశార్థికంపై నైరుతి రుతుపవనాల ప్రభావం దృష్ట్యా ఏటా జనవరి నుంచే ఆర్థిక సంవత్సరం మొదలయ్యేలా చూడాలని 1984లో ఎల్‌కే ఝా కమిటీ సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ పంటల కాలాన్నీ పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్థిక సంవత్సరాన్ని నిర్ధారించాలంటూ నిపుణుల కమిటీని నియమించిన కేంద్రం- ప్రత్యేక బడ్జెట్‌ వ్యూహంతో వ్యవసాయానికి మహర్దశ తీసుకురావాలి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి