17, అక్టోబర్ 2016, సోమవారం

పరిమళిస్తున్న దాలియా పూల సాగు



క్లుప్తంగా :
  దాలియా (Dahlia) ఒక పుష్పించు మొక్కల ప్రజాతి. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలు 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం ఉద్యానవనాలు విస్తృతంగా పెంచుతారు. ఈ సీజన్‌ వస్తే చాలు రంగురంగులతో ప్రతి ఇంటిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలసాగుకు ఏజెన్సీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో రకరకాల దాలియాపూలు, బంతిపూల వనాలను పెంచుతారు. అరచేతికి రెట్టింపు సైజులో ఉండే ఈ పూలను చూడగానే మనస్సును దోచే విధంగా కనిపిస్తాయి.
వివరంగా...... 
విశాఖ మన్యంలో అంతర పంటగా వేస్తున్న గిరి రైతులు..
తక్కువ వ్యయంతో అధిక ఆదాయం
రోస్ నాక్ అవుట్:
విశాఖ మన్యంలో గిరిజనులు దాలియా పూలను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ సాయం, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు అందనప్పటికీ, గిరి రైతులు అనుభవాలే పాఠాలుగా పూల సాగును చేపడుతున్నారు. పాడేరు, హుకుంపేట మండలాల్లోని అధిక సంఖ్యలో గిరి రైతులు దాలియా పూలసాగుపై దృష్టిసారిస్తున్నారు. పసుపు పంటలో అంతర పంటగా దాలియా పూలను సాగు చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి, ఎరువుల వినియోగం వంటివి లేకుండానే లాభాలను ఆర్జిస్తున్నారు

90 రోజులకు పూలు
ఏటా ఏప్రిల్నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకూ తమ పంట పొలాల్లో వున్న దాలియా మొక్కల నుంచే గిరిజనులు విత్తనం దుంపలను సేకరిస్తారు. వర్షాలు పడగానే తిరిగి దుంపలను భూముల్లో పాతుతారు. నెల రోజుల్లో మొక్క బలంగా పెరుగుతుంది. 90 రోజులకు పూలు పూస్తాయి. అటుఇటుగా ఆగస్టు నెలాఖరు నుంచి రైతులకు పూల దిగుబడి వస్తుంది. అలాగే గిరి రైతులు దాలియా పూల విత్తనం దుంపలను భూమిలో పాతడం మినహా ఎటువంటి ఎరువుల వినియోగంగానీ, కలుపు, ఇతర చర్యలు చేపట్టాల్సిన పని లేదు. ఒక ఎకరం భూమిలో దాలియా పూలను సాగు చేస్తే కేవలం మూడు నెలల కాలంలో ఎటువంటి కష్టం లేకుండానే తక్కువలో తక్కువ రూ.30 నుంచి 50 వేల వరకూ సంపాదించవచ్చు. ఎకర భూమిలో 200 కిలోల విత్తనం దుంపలను వేయాలి. స్థానికంగా రైతుల వద్దే 20 కిలోలు రూ.4 వందలు చొప్పున, 200 కిలోల విత్తనాలకు రూ.4 వేలు అవుతుంది. అవి సుమారుగా 1,000 మొక్కలు అవుతాయి. విత్తనం నాటిన తర్వాత సైతం ఎటువంటి ఎరువులుగానీ, క్రిమిసంహారక మందులుగానీ వినియోగించాల్సిన అవసరం లేదు. కానీ పంట కాలం మూడు నెలలు మాత్రం కచ్చితంగా నీటి తడి వుండాలి. అయితే ఏజెన్సీలో వర్షాలు అధికంగా ఉండడంతో దాలియా పూల పంటకు అవసరమైన నీరు సమృద్ధిగా అందుతుంది. 90 రోజుల్లో మొక్కలకు పూలు పూస్తాయి. ఒక్కో మొక్కకు 15 చొప్పున మొత్తం 1,000 మొక్కలకు కలిపి 15,000 పూలు వస్తాయి. మార్కెట్లో డిమాండ్ను బట్టి ఒక్కో పువ్వు ధర రూ.3 నుంచి రూ.6 వరకు ధర పలుకుతుంది. సగటున వంద పువ్వులు రూ.400 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. లెక్కన మొత్తం 15,000 పువ్వులను రూ.4 చొప్పున విక్రయిస్తే రూ.60 వేలు ఆదాయం లభిస్తుంది. విత్తనం ఖర్చులు, ఇతరత్రా అన్నీ కలిపి రూ.5 వేలు అయినా...కచ్చితంగా 55 వేలు మిగులుతుంది

మన్యానికే ప్రత్యేకం దాలియా పూలు
గిరిజన ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,500 అడుగుల ఎత్తులో వుండడంతో ఇక్కడి శీతల వాతావరణం దాలియా పూల సాగుకు అనుకూలంగా ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. దాలియా మొక్కలకు ఎండ ఎక్కువగా తగిలితే వాడిపోతాయని, విత్తనం నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు మొక్కలకు నీటి తడి అవసరమన్నారు. ఏజెన్సీలో మే నెలాఖరు నుంచే వర్షాలు కురుస్తుండడంతో దాలియా మొక్కలకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతుంది. దీంతో వాతావరణపరంగానూ, సాగునీటి పరంగానూ ఏజెన్సీలో ఇబ్బందులు లేకపోవడంతో దాలియా లాభాలు పూయిస్తుందని ఉద్యావనాధికారులు, రైతులు అంటున్నారు. ప్రస్తుతం మన్యంలో లభించే దాలియా పూలకు మంచి డిమాండ్ఉంది. మైదాన ప్రాంతాలైన విశాఖపట్నం, తుని, కంచరపాలెం, గోపాలపట్నం, అనకాపల్లి, రాజమండ్రి మార్కెట్ నుంచి వర్తకులు పాడేరు, పూలను సాగు చేస్తున్న గ్రామాలకు వచ్చి వాటిని కోనుగోలు చేస్తున్నారు. పూల పరిమాణాన్ని బట్టి వంద పూలు రూ.3 వందల నుంచి రూ.6 వందల వరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే లభించే దాలియా పువ్వులు పెద్దవిగా వుండడంతోపాటు నాలుగైదు రోజులు వాడిపోకుండా ఉంటాయి. ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఎంతో అనువుగా ఉండడంతోపాటు ధర సైతం తక్కువ కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వర్తకులు ఎగబడుతున్నారు. వీటిని ఎక్కువగా డెకరేషన్కు వినియోగిస్తున్నారు. వాస్తవానికి బెంగళూరు నుంచి పువ్వులను దిగుమతి చేసుకునే కంటే....మన్యంలోని దాలియా పూలను కొనుగోలు చేస్తే సుమారుగా 60 శాతం వ్యయం తగ్గుతుంది. దీంతో ఇక్కడి పువ్వులకు మంచి డిమాండ్ఉంది.

రూ.25 వేలు సంపాదించాను
నాకు అర ఎకరం భూమి ఉంది. అందులో ఏటా పసుపు పంటలో దాలియా విత్తనాలను వేస్తాను. దానికి పెద్దగా ఖర్చు ఉండదు, ఎటువంటి కలుపు పనులు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో విత్తనాలను వేస్తాను. ఆగస్టు నెలలో పువ్వులను కోసి పాడేరు, గుత్తులపుట్టు తీసుకువెళ్లి అమ్ముతాను. సీజన్లో తక్కువగా అయినా రూ. 25 వేలు వరకు సంపాదిస్తాను. ఎటువంటి ఖర్చు, ఇబ్బందులు లేకుండానే దాలియా పూల వద్ద నాకు ఆదాయం వస్తున్నది
- సీదరి శివయ్య, రైతు

బరిసింగి గ్రామం, పాడేరు మండలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి