17, అక్టోబర్ 2016, సోమవారం

పరిమళిస్తున్న దాలియా పూల సాగు



క్లుప్తంగా :
  దాలియా (Dahlia) ఒక పుష్పించు మొక్కల ప్రజాతి. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలు 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం ఉద్యానవనాలు విస్తృతంగా పెంచుతారు. ఈ సీజన్‌ వస్తే చాలు రంగురంగులతో ప్రతి ఇంటిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలసాగుకు ఏజెన్సీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో రకరకాల దాలియాపూలు, బంతిపూల వనాలను పెంచుతారు. అరచేతికి రెట్టింపు సైజులో ఉండే ఈ పూలను చూడగానే మనస్సును దోచే విధంగా కనిపిస్తాయి.
వివరంగా...... 
విశాఖ మన్యంలో అంతర పంటగా వేస్తున్న గిరి రైతులు..
తక్కువ వ్యయంతో అధిక ఆదాయం
రోస్ నాక్ అవుట్:
విశాఖ మన్యంలో గిరిజనులు దాలియా పూలను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ సాయం, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు అందనప్పటికీ, గిరి రైతులు అనుభవాలే పాఠాలుగా ఈ పూల సాగును చేపడుతున్నారు. పాడేరు, హుకుంపేట మండలాల్లోని అధిక సంఖ్యలో గిరి రైతులు దాలియా పూలసాగుపై దృష్టిసారిస్తున్నారు. పసుపు పంటలో అంతర పంటగా ఈ దాలియా పూలను సాగు చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి, ఎరువుల వినియోగం వంటివి లేకుండానే లాభాలను ఆర్జిస్తున్నారు. 

90 రోజులకు పూలు
ఏటా ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకూ తమ పంట పొలాల్లో వున్న దాలియా మొక్కల నుంచే గిరిజనులు విత్తనం దుంపలను సేకరిస్తారు. వర్షాలు పడగానే తిరిగి దుంపలను భూముల్లో పాతుతారు. నెల రోజుల్లో మొక్క బలంగా పెరుగుతుంది. 90 రోజులకు పూలు పూస్తాయి. అటుఇటుగా ఆగస్టు నెలాఖరు నుంచి రైతులకు పూల దిగుబడి వస్తుంది. అలాగే గిరి రైతులు దాలియా పూల విత్తనం దుంపలను భూమిలో పాతడం మినహా ఎటువంటి ఎరువుల వినియోగంగానీ, కలుపు, ఇతర చర్యలు చేపట్టాల్సిన పని లేదు. ఒక ఎకరం భూమిలో దాలియా పూలను సాగు చేస్తే కేవలం మూడు నెలల కాలంలో ఎటువంటి కష్టం లేకుండానే తక్కువలో తక్కువ రూ.30 నుంచి 50 వేల వరకూ సంపాదించవచ్చు. ఎకర భూమిలో 200 కిలోల విత్తనం దుంపలను వేయాలి. స్థానికంగా రైతుల వద్దే 20 కిలోలు రూ.4 వందలు చొప్పున, 200 కిలోల విత్తనాలకు రూ.4 వేలు అవుతుంది. అవి సుమారుగా 1,000 మొక్కలు అవుతాయి. విత్తనం నాటిన తర్వాత సైతం ఎటువంటి ఎరువులుగానీ, క్రిమిసంహారక మందులుగానీ వినియోగించాల్సిన అవసరం లేదు. కానీ పంట కాలం మూడు నెలలు మాత్రం కచ్చితంగా నీటి తడి వుండాలి. అయితే ఏజెన్సీలో వర్షాలు అధికంగా ఉండడంతో దాలియా పూల పంటకు అవసరమైన నీరు సమృద్ధిగా అందుతుంది. 90 రోజుల్లో మొక్కలకు పూలు పూస్తాయి. ఒక్కో మొక్కకు 15 చొప్పున మొత్తం 1,000 మొక్కలకు కలిపి 15,000 పూలు వస్తాయి. మార్కెట్‌లో డిమాండ్‌ ను బట్టి ఒక్కో పువ్వు ధర రూ.3 నుంచి రూ.6 వరకు ధర పలుకుతుంది. సగటున వంద పువ్వులు రూ.400 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. ఆ లెక్కన మొత్తం 15,000 పువ్వులను రూ.4 చొప్పున విక్రయిస్తే రూ.60 వేలు ఆదాయం లభిస్తుంది. విత్తనం ఖర్చులు, ఇతరత్రా అన్నీ కలిపి రూ.5 వేలు అయినా...కచ్చితంగా 55 వేలు మిగులుతుంది. 

మన్యానికే ప్రత్యేకం దాలియా పూలు
గిరిజన ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,500 అడుగుల ఎత్తులో వుండడంతో ఇక్కడి శీతల వాతావరణం దాలియా పూల సాగుకు అనుకూలంగా ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. దాలియా మొక్కలకు ఎండ ఎక్కువగా తగిలితే వాడిపోతాయని, విత్తనం నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు మొక్కలకు నీటి తడి అవసరమన్నారు. ఏజెన్సీలో మే నెలాఖరు నుంచే వర్షాలు కురుస్తుండడంతో దాలియా మొక్కలకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతుంది. దీంతో వాతావరణపరంగానూ, సాగునీటి పరంగానూ ఏజెన్సీలో ఇబ్బందులు లేకపోవడంతో దాలియా లాభాలు పూయిస్తుందని ఉద్యావనాధికారులు, రైతులు అంటున్నారు. ప్రస్తుతం మన్యంలో లభించే దాలియా పూలకు మంచి డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంతాలైన విశాఖపట్నం, తుని, కంచరపాలెం, గోపాలపట్నం, అనకాపల్లి, రాజమండ్రి మార్కెట్‌ల నుంచి వర్తకులు పాడేరు, పూలను సాగు చేస్తున్న గ్రామాలకు వచ్చి వాటిని కోనుగోలు చేస్తున్నారు. పూల పరిమాణాన్ని బట్టి వంద పూలు రూ.3 వందల నుంచి రూ.6 వందల వరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే లభించే దాలియా పువ్వులు పెద్దవిగా వుండడంతోపాటు నాలుగైదు రోజులు వాడిపోకుండా ఉంటాయి. ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఎంతో అనువుగా ఉండడంతోపాటు ధర సైతం తక్కువ కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వర్తకులు ఎగబడుతున్నారు. వీటిని ఎక్కువగా డెకరేషన్‌కు వినియోగిస్తున్నారు. వాస్తవానికి బెంగళూరు నుంచి పువ్వులను దిగుమతి చేసుకునే కంటే....మన్యంలోని దాలియా పూలను కొనుగోలు చేస్తే సుమారుగా 60 శాతం వ్యయం తగ్గుతుంది. దీంతో ఇక్కడి పువ్వులకు మంచి డిమాండ్‌ ఉంది.

రూ.25 వేలు సంపాదించాను
నాకు అర ఎకరం భూమి ఉంది. అందులో ఏటా పసుపు పంటలో దాలియా విత్తనాలను వేస్తాను. దానికి పెద్దగా ఖర్చు ఉండదు, ఎటువంటి కలుపు పనులు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో విత్తనాలను వేస్తాను. ఆగస్టు నెలలో పువ్వులను కోసి పాడేరు, గుత్తులపుట్టు తీసుకువెళ్లి అమ్ముతాను. ఆ సీజన్‌లో తక్కువగా అయినా రూ. 25 వేలు వరకు సంపాదిస్తాను. ఎటువంటి ఖర్చు, ఇబ్బందులు లేకుండానే దాలియా పూల వద్ద నాకు ఆదాయం వస్తున్నది. 
- సీదరి శివయ్య, రైతు, 

బరిసింగి గ్రామం, పాడేరు మండలం

14, సెప్టెంబర్ 2016, బుధవారం

మీకు వ్యవసాయ భూమి ఉందా? మరి ఈ పదాలు తెలుసా?

  • రెవెన్యూ శాఖలో విస్తృత ఉపయోగం
  • రైతులు, భూ యజమానులకు ఎంతో అవసరం
  • మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి నేటికీ..

భూముల గురించి కొంతయినా పరిజ్ఞానం అవసరం. ఎలాంటి భూమిని ఏమంటారనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆసక్తితో కొందరు, వృత్తి రీత్యా తప్పనిసరిగా మరికొందరు వీటి వివరాలను తెలుసుకుంటుంటారు. వ్యవహారికంగా, ప్రభుత్వ పరంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ, నివాస యోగ్యమైన భూములను ప్రత్యేక విభాగాలుగా విభజించి వాటికి పేర్లు ఖరారు చేసింది. ఇదేమీ ఇప్పుడు జరిగిందేమీ కాదు. తాతల కాలం నుంచీ వస్తున్న అధికారిక పరిభాష. భూ సంబంధిత ఆంశాలపై సమాచారం, రెవెన్యూ యంత్రాంగ విధివిధానాలు, చట్టాలు-నిబంధనల క్రమాలపై అవగాహన రైతులకు, భూ యజమానులకు ఎంతైనా అవసరం. ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు ఆ వివరాలు..

అడంగళ్‌ / పహాణీ 
గ్రామంలో సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టరు. దీనిని ఆంధ్ర ప్రాంతంలో అడంగళ్‌, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలిచే ఈ రిజిస్టరును గ్రామ లెక్క నెంబరు 3 అని కూడా అంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ- పహాణీలు జారీ చేస్తున్నారు. ఈ రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు.

బంచరాయి 
గ్రామంలో పశువుల మేతకు ఉద్దేశింపబడిన ప్రభుత్వ భూమి. గ్రామీణ ప్రాంతాలలో రైతులు, పశువుల పెంపకంపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉంటారు. వారి పశువులకు నిత్యం మేత అవసరం. కాబట్టి నివాసాలకు దూరంగా పచ్చిక ఉన్న ప్రాంతాన్ని పశువులు మేత మేయడానికి ప్రత్యేకంగా ప్రతీ గ్రామంలో గుర్తిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఎవరికీ అధికారాలు ఉండవు.

హోమ్‌స్టెడ్‌ 
హోమ్‌స్టెడ్‌ అంటే గ్రామంలో, పట్టణంలో భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిపనుల వారు ఇతరులకు సంబంధించిన భూములపై తేదీ 14.8.1975 నాటికి నివాసం ఏర్పర్చుకున్న స్థలాన్ని హోమ్‌స్టెడ్‌ అంటారు. అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు.

ఆయకట్టు 
ఒక జలాధారం కింద సాగవుతున్న వ్యవసాయ భూమి. చెరువులు, కాలువల కింద సాగవుతున్న భూములను ఆయకట్టు అంటారు. జిల్లాలో నాగార్జున కాలువల కింద అధిక భూమి సాగువుతోంది. ఆయకట్టు భూమిలో వ్యవసాయం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ భూమిలో ఇతర కట్టడాలు, అభవృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం అంగీకరించదు. 

ఎకరం: 
భూమి విస్తీర్ణమునకు కొలమానము... ఒక ఎకరం 4,840 చదరపు గజములకు సమానము. 100 సెంట్లు లేదా 40 కుంటల భూమిని ఎకరం అంటారు.

అడ్‌వర్స్‌ పొసెషన్‌: 
ప్రతికూల స్వాధీనం, ప్రతికూల ఆధీనం... వాస్తవంగా భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొం దకుండా ఆ భూమిని వాస్తవంగా, శాంతియుతంగా, నిరవధికంగా, బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకొని దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. పట్టా భూమిని 12 సంవత్సరాలు, ప్రభుత్వ భూమిని 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.

అగ్రహారం: 
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా, తక్కువ శిస్తుతో గ్రాంటుగా ఇచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగం.

అజమాయిషీ: 
సరిగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయుట... భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారి రాసిన లెక్కల్లోని వివరాలను గ్రామంలో తనిఖీ చేసిన భూముల్లో కొన్నింటిని తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3 లో రాస్తారు. అజమాయిషీని ప్రతి సంవత్సరం నిర్వహించాలి.

ఎలియనేషన్‌: 
భూమి ఎలియనేషన్‌ అంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం. ఎలియనేషన్‌ను వ్యక్తులకు, సంస్థకు, స్థానిక సంస్థలకుచేయవచ్చు. ఎలియనేషన్‌ను ఉచితంగాగాని, కొద్దిపాటి రుసుముతో గాని చేస్తారు.

ఆబాదీ/గ్రామకంఠం: 
గ్రామంలో ప్రజలు నివసించడానికి ఉద్దేశించిన భూమి. గ్రామ ఉమ్మడి స్థలం. ప్రభుత్వ సభలు, సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు.

ఆబ్సెంటీ ల్యాండులార్డు: 
పరోక్ష భూస్వామి... ఒక గ్రామంలో భూమి ఉండి వేరొకచోట నివాసముంటూ భూమిని సొంతంగా సాగుచేయని భూ యజమాని. భూమిపై హక్కులన్నీ అతడిచే చెందుతాయి.

అసామిషిక్మీ: 
భూ యజమానికి ప న్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వ్యక్తి.

అసైన్డ్‌ భూమి: 
భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికిగాని, ఇళ్లు నిర్మించుకోవడానికి గాని ప్రభుత్వం మంజూ రు చేసిన భూమి. ఈ భూమిని వారసత్వం గా అనుభవించాలి. ఇతరులకు అమ్మరాదు, ఏ విధమైన బదిలీ చేయరాదు.

ఏడబ్య్లూడీ భూములు: 
శిస్తును నిర్దారించిన ప్రభుత్వ భూములు, లేదా అసైన్డ్‌ వెస్ట్‌ ల్యాండ్‌ (AWE)అంటారు. ఏడబ్య్లూడీ భూ ములు మెట్ట భూములయితే డైల్యాండ్‌ భూ ములని అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు అసైన్‌ చేయవచ్చు.

బి-మెమో: 
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శి స్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు.

బందోబస్తు: వ్యవసాయ భూముల సర్వే, వర్గీకరణ.

బంజరు: ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూమి.

భూమి లేని నిరుపేద: 
రెండున్నర ఎకరాల పల్లం లేదా ఐదు ఎకరాల మెట్ట భూమికంటే తక్కువ భూమి ఉండి, సంవత్సరాదాయం రూ.11 వేల కంటే తక్కువ గా ఉన్నవారు భూమి లేని నిరుపేదలు. వీరు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు.

భీఘా: భీఘా అంటే 30 కుంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం.

బిల్‌మక్తా: 
సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, గ్రామా న్ని గాని బిల్‌మక్తా అంటారు.

బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్లు: 
రెవెన్యూ పరిపాలనలో విధివిధానాలను సూచిస్తూ అప్పటి బోర్డు ఆఫ్‌ రెవెన్యూ జారీ చేసిన ఉత్తర్వులు. ఇవి ఇప్పటికీ ఉన్నాయి.

చెల్కా: 
మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్న భూమి. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు.

చలానా: 
ఇర్సాలునామా అనగా గ్రామ లెక్క నం.7. దీనినే చలానా అంటారు. దీ ని ద్వారానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూ మి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.

చిట్టా: 
చిట్టా అనగా రోజువారి వసూళ్లు తెలియజేయు రిజిస్టర్‌. దీనినే గ్రా మ లెక్క నం.6 అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటిపన్ను, భూమి శిస్తు వగైరాలు అసామి వారీగా వసూ లు చేసి ఈ రిజిస్టర్‌లో నమో దు చేస్తారు.

చౌపస్లా: 
పట్టాదారుకు ఉన్న భూముల వివరాలను తెలియజేసే రిజిస్టర్‌. ఇందులో భూ వర్గీకరణ, విస్తీర్ణం, ప ట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి.

దస్తావేజు: 
భూమికి సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలియజేయు పత్రం... భూ బదలాయింపు జరిగినపుడు ఈ దస్తావేజును చట్టపరంగా తప్పక రిజిసే్త్రషన్‌ చేయించుకోవాలి.

డైగ్లాట్‌: 
రాష్ట్రంలోని ప్రతి గ్రామం లో సర్వే సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పూ ర్తిచేసి ప్రతి గ్రామంలో భూ ముల వివరాలను నమోదు చేస్తారు. ఇందులో అన్నిరకా ల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగాణియా, మెట్ట భూములా, వాటి వర్గీకరణ, శిస్తు మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిష్టర్‌ను ఆంగ్లంలో, తెలుగులో రాస్తారు. అందుకే ‘డైగ్లాట్‌’ అంటారు. దీనినే శాశ్వత ఏ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టరు మిగిలిన గ్రామ రెవె న్యూ రికార్డులన్నిటికీ మూలస్తంభంలాంటిది.

ఎన్‌డార్స్‌మెంట్‌: 
గ్రామంలోని ప్రజ లు, ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేయు విధానం.

ఇజారా: 
ప్రభుత్వానికి చెందిన బంజ రు భూములను వ్యవసాయానికి గానీ, నివా సం ఉండడానికి గానీ కొంత నిర్ధిష్టమైన ప న్ను చెల్లించే పద్ధతిపై లీజుకిచ్చుటను ‘ఇజా రా’ అంటారు.

ఫసలీ: 
ఫసలీ అంటే ప్రతి సంవత్సరం జులై, 1 నుంచి తరువాతి సంవత్సరం జూన్‌, 30వ తేదీ వరకు ఉన్న 12 నెలల కాలం. దీనిని పంట కాలంను బట్టి రూపొందించారు. ఈ పదము మొగలు చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.

ఎఫ్‌ఎంబీ టిప్పన్‌: 
ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్ల పటములు ఉంటాయి. వాటి నిర్ధిష్ట కొలతలు కూడా ఉంటాయి.

గట్‌ నంబర్‌: 
సాగు భూమిని నిరుపయోగంగా వదిలి వేయడం. దీనిని బీడు భూమి అని కూడా అంటారు.

గుంట(కుంట): కుంట అంటే 121 చదరపు గజములు. 40 కుంటలు కలిస్తే ఒక ఎకరా.

జమాబందీ: 
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావలసిన భూమి పన్ను, నీటి పన్ను, ఇతర బకాయిలు. సక్రమంగా లెక్క కట్టుట, రెవెన్యూ లెక్కల్లోకి తీసుకురాబడినవా లేదా అని నిర్ధారించుటకు గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీనే జమాబందీ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామంలో ప్రభుత్వానికి రావలసిన మొత్తం డిమాండ్‌ నిర్ధారింపబడుతుంది. అంతేగాక.. మండలస్థాయి అధికారులందరూ వారు నిర్వర్తించాల్సిన విధులు, సక్రమంగా నిర్వహిస్తున్నారోలేదో పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైతులు తమ సాదకబాధలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఇది దోహదపడుతుంది. జమాబందీని ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు నిర్వహిస్తారు.

గిరిజనులకు ఏజెన్సీ:
గిరిజనులు నివసించే ప్రాంతం... గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం షెడ్యూ ల్డు ప్రాంతాలుగా పిలువబడే ప్రాంతాలను ఏజెన్సీ అంటా రు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన యం త్రాంగం ఉంటుంది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం డివిజన్‌లతో పాటు కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలు ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించారు.


భూములపై అవగాహన తప్పనిసరి రెవెన్యూలో కీలకమైనది భూములు. అయితే భూములపై ప్రజలకు అవగాహనలేకపోవడంతో ప్రభుత్వ భూములను కొని మోసపోతున్నారు. అందుకే ప్రజలకు భూములపై అవగాహన తప్పనిసరి. పహణీలలో తమ పేరు ఉందోలేదో కచ్చితంగా తెలుసుకోవాలి. రెవెన్యూ వ్యవస్థ ఆన్‌లైన్‌ కావడంతో ప్రజలు ఏవిషయమైనా తెలుసుకునే అవకాశం ఉంది అయితే ప్రజలు దీనిని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ భూములు సర్కారీ, బంచరాయి, పోరంబోకు అసైన్డు తదితర భూములుంటాయి. అయితే ఈ భూములపై ప్రజలకు అవగాహనలేదు. ఇవి ప్రభుత్వ ఆస్తి. కొంతమంది మోసం చేసి ఈభూములు అమ్ముతుంటారు. కనుక ప్రజలు భూములపై అవగాహన పెంచుకోవాలి.
మూలం: ఆంధ్రజ్యోతి