10, జులై 2016, ఆదివారం

పరిమితులు లేని రక్షణ.. ఫసల్‌ బీమా

పంటల బీమా పథకం రైతుకు కష్ట కాలంలో కొండంత అండగా నిలుస్తుంది. ఈ పథకంపై వారికి లోతైన అవగాహన కల్పిస్తేనే అది విజయవంతం అవుతుందంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ (ప్రణాళిక, పర్యవేక్షణ) సంచాలకుడు డాక్టర్‌ ఈదర నారాయణ.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన విజయవంతం కావాలంటే ఈ పథకంపై రైతుల్లో అవగాహన పెంచాలి. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో 65ఏళ్లుగా బీమా పథకాలకు పట్టిన దురవస్థే దీనికీ పడుతుంది. ప్రభుత్వం ఈ పథకం వివరాలను విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు రైతులు కూడా దీన్ని గురించి తెలుసుకుని బీమా ప్రీమియం చెల్లించడం ద్వారా భరోసా పొందాలి.
రైతుకు ఇవీ ప్రయోజనాలు 
  • తొలకరిలో (ఆహారధాన్యాలు, చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల పంటలకు) బీమా మొత్తానికి 2 శాతం, దాళ్వా పంటకు 1.5 శాతం, వాణిజ్య- ఉద్యాన పంటలకు 5శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాలి, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 
  • బీమా చేసిన మొత్తం సొమ్ముకి పరిహారం కోరవచ్చు. గతంలో మాదిరిగా ఈ మొత్తంపై కొత్త పథకంలో ఎలాంటి పరిమితులు లేవు. రుణం తీసుకున్నవారు, తీసుకోని రైతులకు కూడా బీమా మొత్తం ఒకేవిధంగా ఉంటుంది. రుణం తీసుకోని లేదా కౌలు రైతులు బీమా ప్రీమియంను బీమా క్రమబద్ధీకరణ, అభివృద్ధి సాధికార సంస్థ ఏజెంట్‌ ద్వారా చెల్లించాలి. 
  • పంటలు బెట్టకు, ముంపునకు, చీడపీడలకు, అగ్ని ప్రమాదాలకు, తుపానులు, వడగళ్ల వానలు, పెనుగాలులకు గురై నష్టపోయినప్పుడు కూడా బీమా వర్తిస్తుంది. 
  • నిర్ణీత ప్రాంతాలలలో, 75 శాతం విస్తీర్ణంలో విత్తన మొలక దెబ్బతిన్నా, నీరందక వరినాట్లు వెయ్యకపోయినా, 25శాతం నష్టపరిహారాన్ని 30 రోజుల్లో అందించాలి. ఆ తర్వాత ఆ బీమాను రద్దు చేస్తారు. పల్నాడు ప్రాంతంలో గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనా రైతులకు పరిహారం మాత్రం అందలేదు. 
  • పంట కోసిన తర్వాత పొలంలో పనలపై ఉన్పప్పుడు, 14 రోజుల గడువులో అకాలవర్షాలు, తుపానుల కారణంగా పంట దెబ్బతిన్నా బీమా వర్తిస్తుంది. అయితే ముంపునకు గురైన 48గంటల్లో నష్టంగురించి బ్యాంకు, బీమా కంపెనీ, ప్రాంతీయ వ్యవసాయ శాఖ, జిల్లా అధికారులకు తెలియజేయాలి. టోల్‌ఫ్రీ నంబర్‌ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చు. బీమా చేసిన పంట 25 శాతంకన్నా ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతింటే ఆ ఊరిలో రైతులందరికీ నష్టపరిహారం అందుతుంది. అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో నష్టం జరిగితే నష్టపోయిన రైతులకు మాత్రమే పరిహారం లభిస్తుంది. గత ఏడాది గోదావరి జిల్లాల్లో పంట కోసిన తరువాత తుఫాను వచ్చి పంట దెబ్బతిన్నది. బీమా లేని కారణంగా ఆ రైతులకు పరిహారం అందలేదు. 
  • గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నా పంట ముంపునకు గురైనా, తుపానులు, వడగళ్ల వానలు వచ్చినష్టపోయినా పరిహారం అందుతుంది. దిగుబడి 50 శాతంపైగా దిగుబడి నష్టపోతే 25శాతం బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తారు. అతివృష్టి, అనావృష్టి సంభవించిన ఏడురోజుల్లో నష్టంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. రైతుల నుంచి సరైన సమాచారం అందక అధికారులు పరిహారానికి అప్పీలు చేయని సందర్భాలెన్నో ఉన్నాయి. 
  • ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాల్లో 70శాతం, మధ్యస్థంగా జరిగే ప్రాంతాల్లో 80 శాతం, తక్కువ నష్టం ప్రాంతాల్లో 90శాతం పరిహారం చెల్లిస్తారు. ఉదాహరణకు సగటు దిగుబడి 30బస్తాలుగా భావిస్తే పైన చెప్పినట్లు ప్రాంతాన్ని బట్టి పరిహారం ఇస్తారు. 
  • పంటకు రుణంతోపాటు బీమా ప్రీమియం చెల్లించేందుకూ బ్యాంకులు రుణమివ్వాలి. ఉదాహరణకు ఎకరానికి రూ.30వేల పంట రుణం తీసుకుంటే దానిపై 2శాతం ప్రీమియం కోసం రూ.600 కూడా రుణంగా పొందవచ్చు. 
  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బీమా పథకంలో రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా, డ్రోనను ఉపయోగించి పంట నష్టాన్ని అంచనా వేసి త్వరిత గతిన పరిహారం చె ల్లిస్తారు. 

ఈ జాగ్రత్తలతో సఫలం 

బ్యాంకులకు ప్రీమియంలో 4 శాతం చెల్లిస్తు న్నందున సత్వర సేవలకు అవి చొరవచూ పాలి. పంటలబీమా పోర్టల్‌ద్వారా రైతుకు ఎప్పటికప్పుడు సమాచారమిస్తూ ఈ పథకం పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. ప్రీమియం చివరి తేదీసహా అన్ని వివరాలనూ సీజన్‌కు నెల ముందుగానే తెలపాలి. ప్రతి గ్రామంలో బీమా సహాయకులను నియమించాలి. సీజన ప్రారంభానికి ముందే రాష్ట్రాలు ప్రీమియం సబ్సిడీని అంచనా వేసుకుని, బీమా కంపెనీకి సకాలంలో చెల్లించాలి. పంటకు పరిహారం లెక్కించే పద్ధతిని రైతులకు క్షుణ్నంగా తెలపాలి. పంటల బీమాపై బ్యాంకు అధికారులకూ పూర్తి అవగాహనలేదు. అందరికీ అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వరి, అపరాలు, నూనెగింజలు, మొక్కజొన్న పంటలకు ప్రీమియంను మరింత తగ్గించాలి. దాన్ని కూడా దిగుబడి వచ్చాక చెల్లించే వీలు కల్పించాలి. తద్వారా ఈ పథకం విజయవంతం కాగలదు. 
- డాక్టర్‌ ఈదర నారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి