10, జులై 2016, ఆదివారం

కుంటల నిండా సిరులు

  • కరువు సీమకు ‘సంజీవిని’ 
  • వలస వెతల స్థానంలో 
  • మొదలయిన సాగు కతలు 
  • కర్నూలులో 25 వేల పంట కుంటలు 
  • ఖర్చు చెల్లింపులో రాష్ట్రంలోనే ఫస్ట్‌ 
కర్నూలు, జూలై 10: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన ఉశేన్‌ మొదట్లో అందరిలాగే ఆలోచించాడు. ‘‘పావు ఎకరా పొలం పోవడం తప్ప ఫలితం ఏమిటంటా’’ అంటూ, పంట కుంటల గురించి చెప్పడానికి ప్రయత్నించిన అధికారులను అతడూ ప్రశ్నించాడు. భూగర్భ జలాలు నిండితే ఎవరికంటా లాభం, కడుపులేమైనా నిండుతాయా అంటూ ‘పంట సంజీవిని’పై పెదవి విరిశాడు. ఇప్పుడు ఆ విషయం గుర్తుకు వస్తే చాలు, ఆ రైతులో ఒకింత సిగ్గరితనం కనిపిస్తుంది. పంటలు వేసి మబ్బుల వైపు చూసే రోజులు గతించిపోయినందుకు ఆయన కళ్లలో ఆనందం విచ్చుకొంటుంది. ఉశేన్‌కు గ్రామంలో 4.5 ఎకరాల పొలం ఉంటుంది. పొలాన్ని తడపటానికి బోర్లు వేసి బాగా నష్టపోయాడు. ఈ పరిస్థితుల్లో రెండు నెలల క్రితం అధికారులు ఉశేన్‌ను కలిసి ‘పంట సంజీవిని’ గురించి వివరించారు. పొలంలో పంట కుంట తవ్వుకొంటే పొలానికి నీటి సంవృద్ధి పెరుగుతుందని చెప్పడానికి ప్రయత్నించారు.  మొదట మొండికేసిన ఉశేన్‌ త్వరలోనే చైతన్యం పొందాడు. 10/10/2 సైజులో నీటి కుంటను పొలంలో తవ్వుకున్నాడు. ‘‘మీటరు లోతు తవ్వగానే నీటి ఊట మొదలైంది. ఆ నీటిని తోడేస్తూ మూడు మీటర్ల లోతు తవ్వాను. మట్టి కుంగి పోకుండా చుట్టూ రాతి కట్టడం కట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీటి కుంట.. చిన్న పాటి చెరువును తలపిస్తోంది’’ అని ఉశేన్‌ సంబరంగా వివరించాడు. ‘పంట సంజీవిని’లో భాగంగా అధికారులు ఇచ్చిన ఆయిల్‌ ఇంజన్‌తో నీళ్లను పొలానికి పెడుతున్నానని, మరో ఏడాది వర్షాలు పడకపోయినా పంటలకు దిగులు లేదని ఉశేన్‌ ధీమాతో చెబుతున్నాడు. ఒకనాడు కరువుకాటకాలు, వలస వెతలతో నిండిన తమ బతుకుల్లో ‘పంట సంజీవిని’ తెచ్చిన మార్పును, ఆ మార్పుని తమ ముంగిటకు తెచ్చిన కలెక్టర్‌ విజయమోహన్‌ పట్టుదల గురించి ఉశేన్‌లాగే.. మరికొందరు రైతులూ గుర్తు చేసుకొన్నారు.
 
ఊరు మారింది 
వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా, తవ్విన కుంటల్లో నీళ్లు నిండి.. వాటిని ఎలా వాడుకోవాలో తెలియని రోజుల్లో కలెక్టర్‌ ముందుకొచ్చిన వైనాన్ని కథలుకథలుగా కర్నూలు రైతులు చెప్పారు. మార్కెట్‌లో రూ.30 వేలు పలుకుతున్న ఆయిల్‌ ఇంజన్‌ను రూ.6,100కే అందించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి చేతులు ఎత్తి వారు మొక్కుతున్నారు. నిజానికి, 2011 నుంచి జిల్లాలో వాటర్‌షెడ్‌ పథకం అమల్లో ఉంది. ఈ స్కీం కింద 230 గ్రామాల్లో రెండేళ్ల క్రితం దాకా తవ్వింది వెయ్యి పంట కుంటలే. రైతులు ఉత్సాహంగా ముందుకు రావడంతో.. పంట సంజీవినిలో భాగంగా, ఈ కొద్ది కాలంలోనే 25 వేల పంట కుంటలు సిద్ధమయ్యాయి. కుంటల తవ్వకాల ఖర్చులో కర్నూలు ముందు వరసలో నిలిచింది. ఇప్పటిదాకా కుంటల కోసం రూ.68.83 కోట్లు ఖర్చుచేశారు. 587 ఆయిల్‌ ఇంజన్‌లను పంపిణీ చేశారు. దీనికోసం రైతులకు రూ.61లక్షల మేర రాయితీ కల్పించారు. అలాగే కోసిగి మండలం దొడ్డిబెళగల్‌ చిన్న గ్రామం. కానీ, పంట కుంటల విషయంలో చూపించిన పెద్దరికం ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లకు ఆదర్శంగా నిలిపింది. ఈ ఒక్క ఊరిలోనే 105 పంట కుంటలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తుండగానే కరువు పోయి పొలాలు పచ్చబడుతున్నాయని ఈ గ్రామానికి చెందిన వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌ గౌడ్‌ వెల్లడించారు. 

పంటే వద్దనుకొన్నా, మూడు కార్లు పండిస్తున్నా - ఎల్లప్ప, జాలవాడి, పెద్దకడబూరు మండలం 
‘‘నాకు 2.65 ఎకరాల భూమి ఉంది. వర్షాలు లేకపోవడంతో ఒక పంట పండించడమే కష్టమయ్యేది. అలాంటిది ఇప్పుడు ఏడాదిలో మూడు పంటలు పండించగలుగుతున్నాను. ఒకనాడు రూ.5 వేలకు కౌలుకు ఇచ్చిన భూమిలో ఈనాడు రూ.లక్ష లాభం చూస్తున్నాను. పంట కుంట పుణ్యాన ఇదంతా రెండేళ్లలోనే జరిగిపోయింది.’’ 

బోరునే నమ్ముకొంటే బాగుపడేవారం కాదు - ఈరన్న, దొడ్డిబెళగల్‌ 
కరువు తిష్టివేసిన గ్రామాల్లో దొడ్డిబెళగల్‌ ఒకటి. 500 అడుగుల లోతు బోరు వేసినా నీళ్లు పడేవి కావు. వలస పోయే కుటుంబాలు తప్ప ఊళ్లోకి వచ్చే బంధువులే కనిపించేవారు కాదు. పంట కుంటతో పరిస్థితి మారింది. ఇప్పటికీ బోరునే నమ్ముకొని ఉంటే భుగ్గయిపోయేవాడినన్నది ఈరన్న మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి