26, జులై 2016, మంగళవారం

పల్లెల ప్రగతికి ప్రణాళిక

పల్లెల ప్రగతికి ప్రణాళిక 
ప్రతి పల్లె స్వయం సమృద్ధమైనప్పుడు భారతదేశం ఉజ్వలంగా పురోగమిస్తుందని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారు. నగరాల్లోని సౌకర్యాలను గ్రామాలకూ అందుబాటులోకి తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు విధి నిర్వహణలో విఫలమైనట్లేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వ్యాఖ్యానించారు. రానున్న రెండు మూడు దశాబ్దాల వరకు ప్రపంచంలో అత్యధిక యువ జనాభా భారత్‌లోనే నివసించబోతున్న దృష్ట్యా యువశక్తిని పెద్దయెత్తున ఉత్పాదక కార్యక్రమాలకు నియోగించి దేశ ప్రగతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. కానీ, పల్లెల్లో యువతకు ఉపాధి వ్యాపార అవకాశాలు కొరవడటంతో వారు పట్టణాలకు తరలుతున్నారు. పల్లెల్లో ఆర్థిక అవకాశాల వృద్ధికి రాజీవ్‌ గాంధీ హయాములో గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని చేపట్టినా, దేశంలో ఇప్పటికీ 8,995 గ్రామాలు కరెంటు కనెక్షన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది. ప్రపంచమంతటికీ నిపుణులైన యువ సిబ్బందిని సరఫరా చేసే సత్తా భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుతున్నా, అందుకు తగిన విధానాలను సత్వరం అమలు చేయటం అవసరం. నేడు నాణ్యమైన విద్య, వైద్యం, విద్యుత్‌, ఇంటర్నెట్‌, వినోద, ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ యువత పట్టణాలకు తరలివెళుతోంది. 2011 జనగణన పట్టణాలకు, పల్లెలకు కనీస సౌకర్యాల్లో ఎంత తేడా ఉందో ప్రస్ఫుటంగా చూపింది. 93 శాతం పట్టణ గృహాలకు విద్యుత్‌ సౌకర్యం ఉంటే గ్రామాల్లో 55 శాతానికే ఉంది. 71 శాతం పట్టణ గృహాలకు పైపుల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంటే పల్లెల్లో ఈ వసతి 35 శాతానికే లభిస్తోంది. 31 శాతం గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉండగా పట్టణాల్లో ఇది 81 శాతం. పల్లెల్లో వైద్య, రవాణా సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. పౌష్టికాహార లోపం అక్కడ సర్వసాధారణం. ఈ రకమైన కొరతలే పల్లెవాసులు పట్టణాలకు వలస వెళ్లాల్సిన అగత్యం సృష్టిస్తున్నాయి. వీటిని తీర్చడానికి 2003లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గ్రామాల్లో పట్టణ సౌకర్యాల కల్పన పథకాన్ని (పుర) ప్రారంభించినా, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు పాలు పంచుకోకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. తరవాత జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, సర్వ శిక్షా అభియాన్‌ (విద్య), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ జీవనాధార పథకం వంటివి ప్రారంభించినా పరిమిత విజయాలే దక్కాయి. గ్రామాలకు సేద్యపు నీరు, తాగునీరు, విద్యుదీకరణ, రహదారులు, టెలిఫోన్లు, గృహవసతి కోసం యూపీఏ ప్రభుత్వం లక్షా 75 వేలకోట్ల రూపాయల వ్యయంతో 2005లో ప్రారంభించిన భారత్‌ నిర్మాణ్‌ పథకం కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది.

గ్రామీణ పథకాల పరంపర 

భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పురా పథకంలోని ఉత్తమ పార్శా్వలను తీసుకుని గ్రామాల సాంఘిక, ఆర్థిక, మౌలిక వసతుల వృద్ధికి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.5,142 కోట్ల వ్యయంతో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ గ్రామీణ-పట్టణాభివృద్ధి (రూర్బన్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాల్లో వసతులను మెరుగుపరచడం ద్వారా పట్టణాలకు వలసలు నిరోధించడం, పట్టణాలపై ఒత్తిడి తగ్గించడం కోసం ఈ పథకాన్ని ఉద్దేశించారు. దీనికింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్‌ గ్రామ సముదాయాలను అభివృద్ధి చేస్తారు. అక్కడ వ్యాపార, ఉపాధి నైపుణ్యాలను పెంపొందించి వ్యవస్థాపక సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేసిన ప్రాతిపదిక పత్రానికి అనుగుణంగా రాష్ట్రాలు ఏయే గ్రామాల సముదాయాలను ఏర్పరచాలో నిర్ణయిస్తాయి. మైదాన, కోస్తా ప్రాంతాల్లో ఒకదానికొకటి దగ్గరగా ఉండే గ్రామాలను సముదాయంగా ఏర్పరుస్తారు. వాటిలో 25వేల నుంచి 50వేల జనాభా ఉంటుంది. పర్వత, ఎడారి, గిరిజన ప్రాంతాల్లో 5,000-15,000 జనాభాతో గ్రామీణ సముదాయాలు అవతరిస్తాయి. దేశవ్యాప్తంగా రాగల మూడేళ్లలో 300 గ్రామీణ-పట్టణ (రూర్బన్‌) సముదాయాలు అవతరించాలని లక్షిస్తున్నారు. వివిధ పథకాలకు ప్రభుత్వమిచ్చే నిధులను ఇక్కడ వెచ్చిస్తారు. ఆర్థిక నైపుణ్య శిక్షణ, వ్యవసాయ ప్రాసెసింగ్‌, నిల్వ, గిడ్డంగి సదుపాయాలు, డిజిటల్‌ అక్షరాస్యత, పారిశుద్ధ్యం, పైపుల ద్వారా తాగు నీరు, ఘన, ద్రవ వ్యర్థాల శుద్ధి, గ్రామాల్లో శుభ్రమైన వీధులు, డ్రెయిన్లు, వీధి దీపాలు, సంచార ఆరోగ్య రక్షణ యూనిట్లు, పాఠశాలల మెరుగుదల, రహదారి అనుసంధానం, ఎలక్ట్రానిక్‌ మార్గంలో పౌర సేవల కల్పన, వంటగ్యాస్‌ కనెక్షన్లు, గ్రామీణ రవాణా సదుపాయాలను కల్పించడం ఈ రూర్బన్‌ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు.

గ్రామీణాభివృద్ధి గురించి ఇప్పటికి 75 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. కానీ వాస్తవంలో పల్లెల పురోగతి అంతంత మాత్రమే. ఇప్పటికే రకరకాల పేర్లతో నడుస్తున్న అన్ని గ్రామీణ ప్రగతి పథకాలను ఏకీకరించడానికి కేంద్ర, రాష్ట్రాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. వాటి అమలులో పంచాయతీ రాజ్‌ సంస్థలను మమేకం చేసి, వాటికి తగిన నిధులివ్వాలి. ఇందుకు రాజకీయ దృఢసంకల్పం ఎంతో అవసరం. ఒక్క ఎంపీలనే ఏమిటి, ప్రవాస భారతీయులు, సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలూ తలా ఒక గ్రామాన్ని దత్తు తీసుకుని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలి. అన్నింటినీ మించి ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ గ్రామీణాభివృద్ధి పథకమూ విజయవంతం కాలేదు. రాజస్థాన్‌లో అనేక గ్రామాలు కలిసి వాననీటి సంరక్షణకు చిన్న చిన్న డ్యామ్‌లు నిర్మించుకోవడంతో స్థానికుల జీవితాలు రూపాంతరం చెందాయి. కొన్ని గ్రామాల ప్రజలు ఇలాంటి పథకాలకు సొంత నిధులు సమకూర్చారు. మరికొన్నిచోట్ల శ్రమదానం చేశారు. ఏ గ్రామమూ ఉన్న పళాన ఆదర్శ గ్రామంగా మారిపోదు. ఇతర గ్రామాలకూ ఆదర్శనీయమైన లక్షణాలను పుణికి పుచ్చుకోవడం ద్వారానే ఆ స్థితికి చేరుతుంది. 
దత్తతపై మరింత చొరవ
మోదీ సర్కారు స్మార్ట్‌ నగరాలతో పాటు స్మార్ట్‌ గ్రామాల పథకాన్నీ చేపట్టింది. సన్సద్‌ ఆదర్శ గ్రామయోజన పథకం కింద 2019కల్లా 2,500 స్మార్ట్‌ గ్రామాలను అభివృద్ధి చేయాలని తలపెట్టింది. మొత్తం 800 మంది పార్లమెంటు సభ్యులు 2016నాటికి తలా ఒక గ్రామాన్ని, 2019కల్లా మరి రెండేసి గ్రామాల చొప్పున దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్యోద్దేశం. పల్లెల్లో పేదరిక నిర్మూలనకు స్థానికులతో కలిసి గ్రామ అభివృద్ధి పథకాన్ని రూపొందించడం, వనరులను సమీకరించడం ఎంపీల బాధ్యత. కానీ, మెజారిటీ ఎంపీలు ఈ పథకం అమలుపై ఆసక్తి చూపడం లేదు. సన్సద్‌ ఆదర్శ గ్రామ పథకం ఇప్పటికే అమలులో ఉన్న పలు పథకాల సమ్మేళనంగా ఉందే తప్ప, దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం వల్ల దాన్ని ఆచరణలో పెట్టడం కష్టమవుతోందని అంటున్నారు. మొదటి దశలో 701 మంది ఎంపీలు దత్తత కోసం గ్రామాలను ఎంచుకోగా, రెండోదశలో వారి సంఖ్య 101కి తగ్గింది. కాబట్టి సన్సద్‌ గ్రామ పథకం ఆశించిన ఫలితాలు ఇస్తుందా అన్నది సందేహమే!

డిజిటల్‌ ఇండియా ఆలంబనగా... 

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య, ఆర్థిక, ఆరోగ్య సేవలు అందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది. డిజిటల్‌ ఇండియా పథకం ఈ దిశగా పెద్ద ముందడుగు అవుతుంది. గ్రామీణ భారతాన్ని క్రమంగా మిగతా దేశంతో అనుసంధానించడానికి డిజిటల్‌ ఇండియా కింద గట్టి ప్రయత్నమే జరుగుతున్నా చేయవలసింది ఇంకా చాలా ఉంది. డిజిటల్‌ ఇండియాకు ‘భారత్‌ నెట్‌’ వెన్నెముకగా పని చేస్తుంది. అన్ని గ్రామాలనూ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లతో అనుసంధానించడానికి చేపట్టిన జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పథకాన్నే భారత్‌ నెట్‌గా వ్యవహరిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం భారత్‌ నెట్‌ను 2003లోనే ప్రారంభించినా అది ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం దీన్ని వేగంగా పూర్తిచేయడానికి శ్రద్ధ చూపుతున్నా మొదటి దశ 2017 మార్చిలో మాత్రమే పూర్తవుతుంది. మొత్తం ప్రాజెక్టు 2018 డిసెంబరులోనే పూర్తవుతుంది. మొదటి దశ కింద ముందు అనుకున్నట్లు రెండున్నర లక్షల గ్రామాలను కాకుండా లక్ష గ్రామాలను మాత్రమే అనుసంధానించనున్నారు. డిజిటల్‌ ఇండియా కింద గ్రామాలకు ఎంత త్వరగా బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించగలిగితే అంత వేగంగా ఫలితాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం కరెంటు స్తంభాల మీద ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు వేశారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో వేగంగా భారత్‌ నెట్‌ను పూర్తిచేయవచ్చు. నిర్వహణ వ్యయమూ తక్కువగానే ఉంటుంది. వైర్‌లెస్‌ స్ప్రెక్ట్రమ్‌లో నిరుపయోగంగా ఉన్న ఫ్రీక్వెన్సీల (వైట్‌స్పేస్‌) ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌ సౌకర్యాన్ని కల్పించడానికి మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. దీనికింద శ్రీకాకుళం జిల్లాలో నాలుగు విద్యాసంస్థలను బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన ఈ రెండు ప్రయోగాలు ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తాయి.

గ్రామాలకు టెలికమ్యూనికేషన్‌ అనుసంధానత పెరిగితే ఈ-కామర్స్‌, అక్షరాస్యత విస్తరిస్తాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంభాషణ సుసాధ్యమవుతుంది. బ్యాంకింగ్‌, సబ్సిడీల చెల్లింపు, వ్యవసాయోత్పత్తుల విక్రయం వేగంగా, సులభంగా, సమర్థంగా జరిగి గ్రామీణులు ఎంతో లబ్ధి పొందుతారు. తద్వారా మానవ వనరులు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి చెంది ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది. నిజానికి భారతదేశ సర్వతోముఖ వికాసానికి స్మార్ట్‌ నగరాలకన్నా స్మార్ట్‌ గ్రామాలే అవసరం. నిజమైన భారతదేశం పల్లెల్లోనే నివసిస్తోందని ఇక్కడ గమనించాలి. గ్రామాల్లో ఆదాయ అవకాశాలు, మౌలిక వసతులు, పౌర సేవలు పెరిగితే పట్టణాలకు వలసలు తగ్గిపోతాయి. పల్లెల కొనుగోలు శక్తి పెరిగితే దేశ జీడీపీకి కొత్త పు వచ్చి భారత్‌ అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. రానున్న అయిదేళ్లలో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రవహించబోతున్నాయి. ప్రతి గ్రామానికీ కేంద్రం రూ. 1.60 కోట్లను గ్రాంటుగా ఇస్తుంది. ఈ నిధులను సక్రమంగా, సమర్థంగా వెచ్చిస్తే స్మార్ట్‌ గ్రామ భావన సాకారమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి