31, జులై 2016, ఆదివారం

కలుపు నివారిస్తే కాసులపంటే!

తెలుగు రాష్ట్రాల రైతులందరూ ఖరీఫ్సాగు మొదలు పెట్టారు. వర్షాలు ఊపందుకోవడంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కలుపు తీసేందుకు కూలీలు దొరకడం గగనం అవుతున్నది. పరిస్థితుల్లో రసాయనాల సాయంతో కలుపును ఎలా నివారించాలో వివరిస్తున్నారు.. దశాబ్దాలుగా కలుపు నివారణలో పలు పరిశోధనలు చేసిన ప్రొఫెసర్.ఎస్‌.రావు.

వరిలో ఇలా.. 
నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 400 మిల్లీలీటర్లను 200లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేక 3 రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా వరి విత్తిన 14, 15 రోజుల సమయంలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి సైహాలోపాప్బ్యుటైల్‌ 10 శాతం ద్రావణం 400మిల్లీలీటర్లను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఊద, వెడల్పాకు మొక్కలు నారుమడిలో సమపాళ్లలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు 80 మిల్లీలీటర్ల బిస్పైరిబాక్సోడియం 10 శాతం ద్రవాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై చల్లాలి. మాగాణి వరిలో ఊద మొదలైన ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యుటాక్లోర్‌ 50 శాతం ద్రావణం 1 నుంచి 1.5 లీటర్లు లేదా అనిలోఫాస్‌ 30 శాతం ద్రావణం 400మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 400 మిల్లీలీటర్లలో ఏదో ఒక దానిని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి.

తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకుజాతి మొక్కలు సమపాళ్లలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్‌ 5 శాతం ద్రావణం గుళికలు, 4 కిలోలు 2,4-డి, ఇథైల్ఎస్టర్‌ 4 శాతం ద్రావణం గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. లేదా ఎకరాకు 50 గ్రాముల ఆక్సాడయార్జిల్‌ 80 శాతం పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజులలో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా చల్లాలి. నాటిన 25-30 రోజుల సమయంలో పొలంలో వెడల్పాటి కలుపుమొక్కలు అధికంగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్‌ 80 శాతం పొడిమందును లేదా ఇథాక్సి సల్పురాన 15 శాతం పొడిమందును 50 గ్రాములు ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేలా పిచికారీ చేయాలి.

పత్తిలో నివారణ.. 
విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండి మిథాలిన 45 శాతం ద్రావణం ఎకరాకు 1 నుంచి 1.3 లీటర్లు లేదా అలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 1.5 నుంచి 2 లీటర్లు చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తి 25, 30 రోజులప్పుడు తర్వాత 50-55 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. ఖరీఫ్వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వైజాలాపాప్ఇథైల్‌ 5 శాతం ద్రావణంతోపాటు 250 మిల్లీలీటర్ల పైరిథయోబాక్‌ 10 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పత్తి మొక్కలమీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేట్లు స్ర్పే చేసుకోవాలి.

వేరుశనగలో.. 
విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా బ్యూటాక్లోర్ద్రావణం 1.5 నుంచి 2 లీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20,25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. అలాగే మొక్కలు, మొదళ్లకు మట్టిని ఎగదోయాలి లేదా గడ్డిజాతి మొక్కల నిర్మూలనకోసం ఎకరాకు 250 మిల్లీలీటర్ల పెనాక్సాప్రాప్ఇథైల్‌ 9 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలి.

కందిలో.. 
విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1 నుంచి 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30, 60 రోజుల సమయంలో గుంటకతో కానీ, గొర్రుతో కానీ అంతరకృషి చేయాలి. లేదా ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఇమిజితాపిర్‌ 10 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలి.

మొక్కజొన్నలో.. 
ఎకరాకు 1 నుంచి 1.5 కిలోల అట్రాజిన 50 శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2,3 రోజుల్లో భూమిపై పిచికారీ చేయాలి. విత్తిన 30-35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేసి తర్వాత బోదె నాగలితో సాళ్లు చేసుకోవాలి,.

చెరుకులో... 
ముచ్చెలు నాటగానే లేదా 2, 3 రోజుల్లో అట్రాజిన 50 శాతం పొడిమందును ఎకరానికి 2 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి ఒక నెల వరకు కలుపు నివారించుకోవచ్చు. తోటనాటిన నెల తరువాత 20, 25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2, 3 సార్లు గొర్రు లేదా దంతితో అంతరకృషి చేయాలి. లేదా వెడల్పాటి కలుపుమొక్కలు ఎక్కువగా ఉంటే 2,4-డి సోడియం సాల్ట్‌ 80 శాతం పొడిమందు 500గ్రాముల చొప్పున 30, 60 రోజుల తర్వాత పిచికారీ చేయాలి. లేదా 2, 4-డి సోడియం సాల్ట్‌ 80శాతం పొడిమందు 500గ్రాములు, మొట్రిబుజిన 70 శాతం పొడిమందు అరకిలో ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య మాత్రమే పైరుపై పడకుండా 30, 60 రోజులప్పుడు స్ర్పే చేస్తే కలుపును సమర్థంగా నివారించవచ్చు.

సోయా చిక్కుడు.. 
విత్తిన వెంటనే లేదా 1, 2 రోజులలో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1 ఉంచి 1.3 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. లేదా విత్తిన 20 రోజుల సమయంలో ఇమిజాతాపిర్‌ 10 శాతం ద్రావణం ఎకరాకు 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలపి స్ర్పే చే యాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి