11, జులై 2016, సోమవారం

గిత్తల ర్యాంప్‌ షో సూపర్బ్‌

దేశీ ఆవులు, గిత్తలపై అవగాహనకు బుల్‌ షో 
ఒంగోలు గిత్తను పరిరక్షించుకోండి 
‘బుల్‌ షో’లో బ్రెజిల్‌ ప్రతినిధుల వెల్లడి 

కళ్లు చెదిరే అందాలు... జిగేల్‌మనిపించే వసా్త్రలు... క్యాట్‌ వాక్‌ వయ్యారాలు!! సాధారణంగా ర్యాంప్‌ వాక్‌పై మనకు కనిపించే దృశ్యాలివి. కానీ ఇక్కడ క్యాట్‌ వాక్‌లు లేవు.. కవ్వించే అందాలు అంతకన్నా లేవు. అయినా ప్రతి ఒక్కరి చూపూ ర్యాంప్‌ మీదనే.! దర్పం ఒలకబోస్తూ ఠీవిగా ర్యాంప్‌ మీదకు వచ్చిన ఆ జీవాలపైనే!! ‘మనదే..’ అంటూ ఆనందం.. ‘అవునా’ అంటూ ఆశ్చర్యం.. ఇలా ఎన్నెన్నో భావాలు..! వీటన్నిటికీ వేదికంది.. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన బుల్‌ షో. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ‘జాతీయ గిత్తల ర్యాంప్‌ షో’ను సోమవారం రాత్రి నిర్వహించారు. తెలంగాణాకు చెందిన తూరుపు గిత్తల ర్యాంప్‌ వాక్‌తో ప్రారంభమైన ప్రదర్శన కేరళకు చెందిన వెంచుర్‌, పుంగనూరు గిత్త, ఒంగోలు, దేవరకోట, గిర్‌ (గుజరాత్‌), కాంక్రేజ్‌ (గుజరాత్‌) జాతుల ప్రదర్శనతో వేడుకగా జరిగింది. మొత్తం 10 జాతులకు చెందిన 19 గిత్తలను ఇక్కడ ప్రదర్శించారు. ర్యాంప్‌పై రాజసాన్ని ప్రదర్శించడంలో ఏ మాత్రం తొణకని గిత్తలకు అవార్డులను అందజేశారు. 

రక్షించుకునే బాధ్యత మీదే
నవ్యాంధ్రను ‘క్షీరాగారం’గా మార్చేందుకు కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అరుదైన ఒంగోలు జాతి గిత్తలను అంతరించి పోకుండా కాపాడుకోవాలన్నారు. కృత్రిమ గర్భధారణ విషయంలో ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలని బ్రెజిల్‌కు చెందిన నొగారియో తెలిపారు. బ్రెజిల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ రెండో క్షీర విప్లవం సాధించే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. కేవలం పెయ్యదూడలు మాత్రమే జన్మించేలా కొత్త టెక్నాలజీని ఏపీలో తీసుకురానున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి తోడ్పాటు అందించేలా నకరికల్లులోని బఫెలో బ్రీడింగ్‌ సెంటర్‌ రూపుదిద్దుకోనుందని స్పీకర్‌ చెప్పారు. 
విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చలు షురూ
ఏపీకి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌-2029పై సోమవారం చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ అధ్యక్షతన శాఖల వారీగా ఈ చర్చలు జరిగాయి. తొలిగా వ్యవసాయశాఖకు సంబంఽధించి సమావేశం జరిగింది. దీనిలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక అంశాలపై చర్చించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి