10, జులై 2016, ఆదివారం

అనంతపురం: కందుకూరు... కామధేనువు!

కరువనగానే అనంతపురం జిల్లా పేరు ఠక్కున గుర్తొస్తుంది. ఆ జిల్లాలోని కందుకూరును కూడా కరువు బాధిస్తుంది. కానీ, ఆ గ్రామస్థులకు మాత్రం పాడి పుణ్యమా అని 30 ఏళ్లుగా ఆ కష్టాలు దరిచేరడం లేదు. పాడి ఆ గ్రామానికి ఎలా కళాకాంతులు తెచ్చిందో చూద్దాం రండి!
 
అనంతపురం రూరల్‌ మండలంలోని కందుకూరు గ్రామంలోనూ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల తరహాలోనే పంటలు ఎండిపోయి కనిపిస్తాయి. కానీ, అక్కడి రైతులకు అప్పులబాధ లేదు. ఆర్థిక కష్టాలతో ఒక్కరు కూడా ఆత్మహత్యకు పాల్పడిన దాఖలాల్లేవు. కారణం... వాళ్లు ఆవుల్ని నమ్ముకున్నారు! పంటలు ఎండినా 1500కుటుంబాలున్న కందుకూరును పాడి ఆదుకుంటోంది. గ్రామంలో 3వేల ఆవులుండగా నికరంగా పాలిచ్చేవి రెండువేలుంటాయి. రోజుకు 4000 లీటర్లదాకా పాలు ఆ ఊరినుంచి జిల్లాకేంద్రంలోని ప్రైవేటు పాలకేంద్రానికి వెళతాయి. ఇందుకోసం ఆ డెయిరీవారే గ్రామంలో సేకరణ కేంద్రం ఏర్పాటు చేశారు.

నెలకు రూ.30 లక్షల ఆదాయం 
కందుకూరు పాడి రైతుల నికరాదాయం నెలకు రూ.30లక్షల పైమాటే. జెర్సీ ఆవులు పూటకు 10 లీటర్ల సగటుచొప్పున రోజుకు 20 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. లీటరుకు రూ.26 వంతున 2వేల ఆవులిచ్చే 4వేల లీటర్ల పాలకు నిత్యం రూ.1.04 లక్షల రాబడి వస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.31.2 లక్షలు రైతులకు అందుతోంది. కందుకూరులో రైతులందరికీ పొలాలున్నా రోజులో అధిక కాలాన్ని పాడిపశువుల కోసమే కేటాయిస్తారు. వారంతా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతోపాటు వయసొచ్చిన అమ్మాయిలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తున్నారు. ఊళ్లో అప్పులున్న రైతులే లేరు. పథకాల గురించి గానీ, ఎవరో వచ్చి ఏదో చేస్తారనిగానీ వారు ఎదురుచూడరు. ఒక్కో ఆవు రోజుకు రూ.520ఆదాయం సమకూరుస్తోంది. మేత ఖర్చు మహా అంటే పచ్చిగడ్డి, తౌడు, మొక్కజొన్న దాణా కలిపి రూ.100కు మించదు. కాబట్టి నికరంగా రూ.420 ఆదాయం ఉంటుంది. కొందరు నెలకు రూ.లక్ష దాకా సంపాదిస్తున్నారు. పంట రాకపోయినా ఆవులే కామధేనువుల్లా ఆదుకుంటున్నాయని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఆవు మా ఇంటి మహలక్ష్మి - పెద్దన్న 
ఆవు మా ఇంటి మహలక్ష్మి. నేను పాతికేళ్లకిందట ఓ ఆవును కొన్న తర్వాత కష్టాలనుంచి ఒడ్డునపడ్డాను. 13ఏళ్ల క్రి తం మరో ఆవును కొంటే ఇప్పుడు 13కాగా, 6 పాలిస్తున్నా యి. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాను.


పిల్లల్ని చదివించుకున్నా - దాసరి లక్ష్మీనారాయణ
పాడివల్లనే మా ఇల్లు కళకళలాడు తోంది. నా ముగ్గురు కొడుకుల్లో ఒకరిని డిగ్రీ, ఇద్దర్ని ఎంబీఏ చదివించాను. ఓ కొడుకు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండెకరాల పొలం, ఇల్లు, స్థలం కూడా కొన్నాను. 
 
సాగుకన్నా పాడి మేలు - వీరనారాయణరెడ్డి 
మాకు తోట ఉన్నా ఫలితంలేదు. ఇప్పు డు 4 ఆవులున్నాయి. నెలకు 15వేలదాకా ఆదాయం వస్తోంది. మా పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్లో చదివిస్తున్నా. ప్రభుత్వం రుణాలిస్తే మా బతుకులు ఇంకా బాగుపడతాయి. 

జీవితం హ్యాపీ - ఓబిలేసు
కరువుకాటుతో సొంతూరు వదిలి కందుకూరుకు వచ్చాను. ఇక్కడివాళ్లను చూసి నేనూ ఒక ఆవును కొన్నాను. అది 15 లీటర్ల పాలిస్తోంది. జీవితం ఏ ఇబ్బందులూ లేకుండా సాగిపోతోంది. 

- ఆంధ్రజ్యోతి, అనంతపురం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి