10, ఆగస్టు 2016, బుధవారం

భూమి పుత్రిక

ఓర్పులో భూమాతను మించిన వాళ్లు లేరు. అలాంటి భూమాత ఒక మహిళకు పరీక్ష పెట్టింది. పరీక్ష చెట్టంత భర్త హఠాన్మరణం. దాంతో కొంగు నడుముకు చుట్టి..  మగవాడిలా తలకు పాగాకట్టి.. ఒంటిచేత్తో అరకపట్టి.. పొలంబాట పట్టింది అనంతపురం జిల్లా గాండ్లపర్తి కొత్తపల్లెకు చెందిన ఉమామహేశ్వరి. జీవితాన్ని పరీక్షకు నిలబెట్టిన భూమాతే.. సేద్యంలో ఆమె ఓర్పును, నేర్పును చూసి ఆశీర్వదించింది.  

ఉమామహేశ్వరి బీఏ పట్టభద్రురాలు. ఒక రైతుతో పెళ్ళయింది. పిల్లలు పుట్టారు. ఇల్లు, భర్త, పిల్లలు.. జీవితం హాయిగా నడిచిపోతోంది. అంతలోనే ఏమైందో ఏమో విధికి కన్నుకుట్టింది. హఠాత్తుగా ఆమె ప్రపంచం తలకిందులైనట్టు.. అంతవరకు తోడున్న భర్త చనిపోయాడు. సేద్యపు పనులన్నీ నెట్టుకొస్తున్న ఆయన.. అర్ధాంతరంగా వెళ్లిపోతే.. ఏం చేయాలి? సేద్యం ఎవరు చేయాలి? కుటుంబాన్ని.. ఇద్దరు ఆడపిల్లలను ఎలా బయటపడేయాలి? చదువు సంధ్యలు, సంసారం.. అప్పులు చుట్టుముట్టాయి. రెండున్నర ఎకరాల పొలం, రెండున్నర లక్షల అప్పు. కంటి ముందు కటిక చీకటి. తండ్రి ధైర్యం చెప్పాడు. ఆసరాగా నిలబడ్డాడు. ఆసరాతో ఆమె పలుగూ పారా చేతబట్టింది. దుఃఖాన్ని దిగమింగింది. కొంగు బిగించి సేద్యం మొదలు పెట్టింది. ద్రాక్ష నాటింది. వ్యవసాయ కుటుంబమే అయినా గడప దాటకుండా పెరిగిన ఉమామహేశ్వరి తొలుత ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఒకవైపు ప్రతికూలంగా ఉండే ప్రకృతి, తెగుళ్ల ముట్టడితో దెబ్బతినే ద్రాక్ష తోట. మరోవైపు బిడ్డల చదువుల ఖర్చు. గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకున్న నైపుణ్యమే ఆమెకు వ్యవసాయంలోనూ ఉపయోగపడింది. వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబంలో ఎదుర్కొన్న సంక్షోభాలకన్నా కష్టమైనవిగా ఆమెకు అనిపించలేదు. పిల్లల్ని పెంచినంత ప్రేమగా ద్రాక్ష తీగలనూ చూసుకుంటోంది. పిల్లలకు అనారోగ్యమొస్తే తల్లడిల్లినట్లే ద్రాక్ష తీగకు తెగలు సోకినపుడూ ఆందోళనపడుతుంది. ఇతర రైతుల అనుభవం నుంచి ఎన్నో నేర్చుకుంది

అప్పులు తీర్చి.. పిల్లల్ని గట్టెక్కించి..
ద్రాక్ష సాగు మొదలు పెట్టిన రెండేళ్లకే భర్త చేసిన అప్పు తీర్చేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల చదువు కోసం ఏడాదికి అయిదారు లక్షల ఖర్చు ఇప్పుడామెకు భారంగా లేదు. పెద్దమ్మాయి పద్మజ బెంగుళూరులో ఫైనలియర్బీటెక్చదువుతోంది. రెండో కూతురు సాయిశ్రీ హైదరాబాద్లో సివిల్స్అకాడమీలో చదువుతోంది. ‘ఆమె కలెక్టరై మాలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలవాలనేది నా కలఅంటారు ఉమామహేశ్వరి. ‘ద్రాక్ష సాగు భలే కష్టం. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఉదయం సాయంత్రం పంటను గమనిస్తుండాలి. వాతావరణం మారినప్పుడల్లా పంటకు చీడపీడలు ఆశిస్తుంటాయి. ఆకులకు, కొమ్మలకు, పూతకు తెగులు కనిపిస్తే, ఆరోజే మందులు పిచికారీ చేయాలి. శ్రద్ధగా చేస్తే ద్రాక్ష సాగుతో లక్షలు వస్తాయిఅంటుందామె. కేవలం రెండున్నర ఎకరాల ద్రాక్ష సాగులో ఏడాదికి 15 లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. వ్యవసాయ ఖర్చులు అయిదారు లక్షలు పోను పదిలక్షలు మిగులుతాయి. ‘‘మొదట్లో కూలీలు దొరకడం పెద్ద సమస్యగా ఉండేది. మందుల పిచికారీకి మనుషులు తప్పనిసరి. కానీ సమయానికి దొరికేవాళ్ళు కాదు. తర్వాత మినీట్రాక్టర్కొని నడుపుతున్నాను. దానితోనే మందులు స్ర్పే చేయవచ్చు. బుల్లి ట్రాక్టర్రాకతో నాకు వ్యవసాయం ఎంతో తేలికైందిఅని వ్యసాయంలోని కష్టసుఖాలను వివరించింది ఉమ. ‘జీవితం ఇక ముగిసిపోయిందనుకున్న సమయంలో మా నాన్న కుమారస్వామి నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చదువుకుంటున్న నా పిల్లలు నాకు పెద్ద ఆసరా. వ్యవసాయ పనుల్లో సహకరిస్తుంటారు. వాళ్లు ట్రాక్టరుతో సేద్యపు పనులు చేయడం నాకంటే బాగా నేర్చుకున్నారుఅంటుంది ఉమ

తోటి రైతులకు ఆదర్శం
ఉమామహేశ్వరి శ్రద్ధగా చేసే ద్రాక్ష సేద్యంలో పండుతున్న లక్షలు చూసి చుట్టుపక్కల ఎందరో రైతులు ద్రాక్ష సాగు మొదలు పెట్టారు. వారికి ఈమె సలహాలు కూడా ఇస్తుంటారు. ఉమామహేశ్వరి మరిది రామాంజనేయులు రైల్వే ఉద్యోగం మానేసి మరీ ద్రాక్ష సాగు మొదలు పెట్టాడు. చెల్లెలు వైశాలి కూడా అక్క బాటలో సేద్యం చేస్తోంది. అనంతపురంలో బేకరీ నడుపుకునే ఒక వ్యాపారి కూడా ఉమామహేశ్వరి సేద్యం చూసి ద్రాక్ష రైతుగా మారారు. ‘జిల్లాలో సీడ్లెస్ద్రాక్ష సాగును మొదట నేనే చేశాను. కిలో ద్రాక్ష రూ.49కి తోటలోనే విక్రయించాను. రూ.34కు తక్కువ ఎప్పుడూ అమ్మలేదు. ద్రాక్ష నా కుటుంబాన్ని కాపాడిందిఅని కృతజ్ఞతగా చెబుతుంది ఉమామహేశ్వరి. జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో చేస్తే వ్యవసాయంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితే ఉండదన్నది ఆమె ఇస్తున్న భరోసా. ‘అప్పులున్నాయని ఆత్మహత్యలు చేసుకోవడం పిరికి పని. సేద్యం వదిలేస్తే అప్పులు పెరగక ఇంకేం పెరుగుతాయ్‌. ముందు రైతు బద్ధకాన్ని వదిలేయాలి. చేలో పంటేసి సిటీల్లో తిరగడం మానాలి. చేలోని పంటను ప్రాణంగా చూసుకోవాలి. జాగ్రత్తగా సాగుచేస్తే సాఫ్ట్వేర్ఉద్యోగి జీతంకన్నా ఎక్కువ ఆదాయం సాధించవచ్చుఅని ఒక మహిళా రైతుగా పద్నాలుగేళ్ల అనుభవంతో చెబుతోందామె
[అనంతపురం]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి