12, ఆగస్టు 2016, శుక్రవారం

బిందువు... ఆపద్బంధువు

సమర్థ నీటి నిర్వహణకు మార్గాలు
జలమే జగతికి జీవనాధారం. నీరులేనిదే ప్రాణీ బతకజాలదు. మనుషులు, జంతువులు, పక్షులు, సేద్యం, పరిశ్రమలకు నీరే ఆధారం. రెండేళ్ల వరస కరవు పరిస్థితుల తరవాత ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నీటిని ఉప్పు సముద్రం పాలు చేయకుండా పరిరక్షించుకోగలిగితేనే భవితకు భరోసా. దిశలో ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు, భావి ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

రుతుపవనాలు సహకరించకపోవడం వల్ల ఇప్పటికే ఏర్పడిన కరవులు జనజీవితాలను అస్తవ్యస్తం చేశాయి. 1943-44లో సుమారు 30 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నబెంగాల్క్షామంమనదేశ చరిత్రలో మాయని మచ్చ. 1999, 2002, 2004, 2009, 2014, 2015 సంవత్సరాల్లో సంభవించిన కరవుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మనదేశం ఆహార దినుసులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అదృష్టవశాత్తు, నేడు దేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించగలిగింది. నాగార్జున సాగర్‌, బాక్రానంగల్‌, హీరాకుడ్లాంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కాల్వల వంటివి ఇందుకు దోహదపడ్డాయి. సమర్థ నీటి సంరక్షణ, నిర్వహణ పద్ధతుల ద్వారా కరవు పరిస్థితుల్ని శాశ్వతంగా తరిమికొట్టే అవకాశం ఉంది.

పెరుగుతున్న అవసరాలు 
నీటి నిర్వహణలో నాలుగు అంశాలు కీలకమైనవి. అవే కరవు పరిస్థితుల్ని నివారిస్తాయి. అవి: 1) సమృద్ధిగా వానలు కురవడానికి వాతావరణంలో సమతుల్యత కాపాడటం. 2) కురిసిన వర్షపు నీటిని జాగ్రత్తగా నిల్వ చేయడం. 3) తక్కువ నీటితో ఎక్కువ ఫలితం పొందడం. 4) వ్యక్తిగత స్థాయిలో, క్షేత్రస్థాయిలో నీరు వృథా కాకుండా చూడటం. అడవుల సంరక్షణ, మొక్కలు నాటడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల ద్వారా వాతావరణంలో సమతుల్యత సాధించి సకాలంలో సరైన వర్షాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. వాననీరు సముద్రంలోకి పోకుండా ప్రాజెక్టులు నిర్మించడం, ఇంటిముందు ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట గుంతల తవ్వకం, చెరువుల్లో పూడికతీత వంటి చర్యల ద్వారా కురిసిన వర్షపునీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకొనవచ్చు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల నదుల అనుసంధాన పథకాన్ని పూర్తిచేసి, కరవుతో అల్లాడుతున్న రాయలసీమ రైతులకు నీరందిస్తున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరితగతిని పూర్తిచేయడానికి ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి సంరక్షణ, నిర్వహణ విషయంలో తెలంగాణ సర్కారూ మంచి చొరవే కనబరుస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులకు పునరాకృతి కల్పిస్తోంది. మూడేళ్లలో పెండింగ్ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలని సంకల్పించింది. ఇవన్నీ వర్షపు నీరు వృథా కాకుండా, నిల్వ చేసుకోడానికి తీసుకుంటున్న చర్యలే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలిస్తే రానున్న కాలంలో కరవు పరిస్థితులకు ఆస్కారమే ఉండదు. ఇక డ్రిప్‌, స్పింక్లర్లతో కూడిన సూక్ష్మసేద్య పద్ధతుల ద్వారా రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఫలితం పొందవచ్చు. ఇజ్రాయెల్ పద్ధతి అనుసరించే ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

నీటి వనరుల బృందం నివేదిక ప్రకారం, 2030నాటికి పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ కారణంగా భారత్నీటి అవసరం 1.498 శతకోటి ఘనపు మీటర్లకు పెరగనుంది. ప్రస్తుత గిరాకీకి ఇది రెట్టింపు. కాబట్టి భావితరాలవారికి నీటిని అందించవలసిన అవసరముంది. ఇంతటి భారీ పరిమాణంలో నీటిని సమకూర్చడం సవాలే. నీటిని పెద్దయెత్తున నిల్వ చేయగల వసతులు దేశంలో తక్కువ. నీటి ఎద్దడి సమస్యలకు రెండు సూచికలు ఉన్నాయి. 1) తలసరి నీటి లభ్యత 2) నీటి నిల్వ సామర్థ్యం. భారత జనాభా 1951లో 36 కోట్లు. 2011నాటికి అది 121 కోట్లకు పెరిగింది. తలసరి నీటిలభ్యత 1951లో ఏడాది సగటు 5,177 ఘనపు మీటర్లు, 2011నాటికి అది 1,545 ఘనపు మీటర్లకు చేరింది. అంటే, సుమారు 70 శాతం పడిపోయింది. నీటి ఎద్దడి నిర్వచనం ప్రకారం నిర్దేశిత నీటి లభ్యత 1,700 ఘనపు మీటర్లు. 2001 జనాభా లెక్కల ప్రకారం సగటు తలసరి నీటి లభ్యత 1816 ఘనపు మీటర్లు ఉండటం గమనార్హం.

ప్రపంచంలో భారతీయులే అత్యధికంగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. గృహ, పారిశ్రామిక అవసరాలకు 9.27 శాతం, సేద్యానికి 90.73 శాతం భూగర్భ జలాలు ఉపయోగిస్తున్నారు. గడచిన నాలుగు దశాబ్దాల్లో పెరిగిన నికర సాగు భూమి విస్తీర్ణంలో 84 శాతానికి భూగర్భ జలాలే ఆధారంగా ఉన్నాయి. భూగర్భ జలాలను భారీస్థాయిలో, వాడకూడని రీతిలో వాడుతున్నారని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. భారత్లో 80 శాతం నీటివనరులను వినియోగిస్తున్న వ్యవసాయ రంగంలో జల వినియోగ నిపుణత కేవలం 38 శాతమే. మలేసియా, మొరాకోల్లో ఇది 45శాతం, ఇజ్రాయెల్‌, జపాన్‌, చైనా, తైవాన్లలో 50 నుంచి 60 శాతం. కేంద్ర భూగర్భ జలసంస్థ గణాంకాల ప్రకారం 20 రాష్ట్రాల్లో నీరు ఫ్లోరైడ్వల్ల కలుషితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం- అధిక శాతం నైట్రేట్కారణంగా నీరు విషతుల్యంగా మారింది.

కరవు నివారణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకుడు గుంతల కార్యక్రమం భారీస్థాయిలో సాగుతోంది. ఇంటింటా ఇంకుడు గుంతలన్నది ఇప్పుడు మహోద్యమ రూపం సంతరించుకొంది. కొద్దిరోజుల్లోనే లక్షల లక్ష్యాన్ని చేరుకొనే దిశగా పరుగులు తీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సదస్సుల్లో నీటి పొదుపు, కాలుష్యం, వృథాపై ప్రజలు గొంతెత్తుతున్నారు. మేడపై పడే వర్షపు నీటిని మురుగునీటి కాల్వలోకి వదిలేయకుండా ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు.

దిద్దుబాటు చర్యలు 
భారీ నీటి ప్రాజెక్టుల కన్నా అధిక స్థాయిలో సూక్ష్మ సేద్యం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని అధ్యయనాల్లో వెల్లడైంది. నీటిని పొదుపు చేయడంలో సూక్ష్మసేద్యం పాత్ర కీలకమైనది. జల సంరక్షణలో భాగంగా నీటిని పొదుపు చేసే సృజనాత్మక వ్యూహాలపై భారత్ఇటీవల ఇజ్రాయెల్తో అవగాహన కుదుర్చుకొంది. హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ప్రాంతంలో కూరగాయలు పండించే చిన్న రైతులు తమ ఉత్పత్తుల కొనుగోలుదారులైన డెయిరీ సంస్థ సహకారంతో సూక్ష్మసేద్యం ద్వారా చాలాకాలం నుంచి అధిక లాభాలు గడిస్తున్నారు. దురదృష్టవశాత్తు కమతాలు చిన్నవి కావడం, నేల స్వభావాన్ని బట్టి ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమూనా అవసరపడటం. రాయితీలు సక్రమంగా అందించలేకపోవడం వంటి కారణాల వల్ల మనదేశంలో సేద్య విధానం ప్రాచుర్యం పొందలేకపోయింది. నీటి ఎద్దడిని తట్టుకునే పప్పు ధాన్యాలు, వరి రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రధాని మోదీ ప్రకటించిన కృషి సించాయి యోజనను సద్వినియోగం చేసుకోవాలి. ఇదివరకటి ప్రభుత్వాలు జలసంరక్షణ అంశాన్ని ఏళ్లకు ఏళ్లు గాలికి వదిలివేశాయి. ఇప్పుడు ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలూ, రైతులూ పూర్తిస్థాయిలో సహకరిస్తేనే అవి సఫలమవుతాయి. దిశలో అడుగు పడాల్సిన సమయమిదే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి