12, ఆగస్టు 2016, శుక్రవారం

పంటపొలంలో మరో విప్లవం!

దేశంలో మార్పు తేవడానికి ఎన్ని మహత్తరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటి ఫలితాలను అంతిమ వ్యక్తికి అందించలేకపోతే మనం విఫలమైనట్టే’- ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. దేశ వ్యవసాయ రంగానికి వ్యాఖ్య అతికినట్టు సరిపోతుంది. గడచిన 69 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు అధికారం చేపట్టినా, సగటు రైతు జీవన స్థితిగతుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. స్వాతంత్య్రానంతరం వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, వాటి ఫలితాలను అంతిమ లబ్ధిదారులైన చిన్న, సన్నకారు రైతులకు అందించలేకపోవడమే వైచిత్రి.

పెనుమార్పులు 
స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించింది. హరిత విప్లవం కారణంగా దేశ వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. సంప్రదాయ సేద్యం ఒక్కసారిగా ఆధునిక రూపు సంతరించుకుంది. ముఖ్యంగా వరి, గోధుమ పంటల్లో హరిత విప్లవం పెను మార్పులనే తెచ్చింది. పంటల సరళి అనూహ్యంగా మారింది. ఉత్పత్తి, ఉత్పాదకతల్లో కదలిక మొదలైంది. యాంత్రీకరణ విస్తరించడంతో సేద్య పనుల్లో వేగం పెరిగింది. ఆధునిక వ్యవసాయానికి అంకురార్పణ జరిగింది. వరి, గోధుమ పంటల్లో సంప్రదాయకంగా రైతులు వూహించని విధంగా రెట్టింపు దిగుబడులు సాధ్యపడ్డాయి. హరిత విప్లవం వచ్చాక అధిక దిగుబడుల కోసం సంప్రదాయకంగా వాడే పశువుల పేడ స్థానే రసాయన, క్రిమిసంహారకాల వాడకం పెరిగింది. ఇది దిగుబడుల్ని ప్రభావితం చేస్తుండటం రైతుల్ని ఆకర్షించింది. సంప్రదాయ పద్ధతులకు తిలోదకాలివ్వడం అప్పుడే మొదలైంది. పొడుగు రకాల పంట స్థానంలో పొట్టి విత్తనాలు వచ్చాయి. ఉత్పత్తి రెట్టింపు కావడం రైతుల్లో ఆశలు రేకెత్తించింది. పక్క రైతును చూసి పోటాపోటీగా రసాయనాలు వాడే దుస్థితీ దాపురించింది. ఫలితంగా సేంద్రియ పదార్థం అందక నేలలు అవి గిడసబారడం మొదలైంది. ప్రకృతి వనరులిలా కలుషితమవడం, ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి ఉండటం ఎక్కువైంది. ఎలాంటి అవగాహన లేకుండా వీటిని ఉత్పత్తి చేస్తూ వచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలు అమలులోకి వచ్చాక, సంపన్న దేశాలు రసాయన అవశేషాలనే సాకుగా చూపి, పేద దేశాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకొనేందుకు నిరాకరిస్తూ వచ్చాయి. భారత్విషయంలోనూ ఇలాగే జరిగింది. అవి తమ ఉత్పత్తుల్ని మనకు విరివిగా ఎగుమతి చేయగలుగుతున్నాయి కానీ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మనం దేశాలకు ఎగుమతుల్ని పెంచుకోలేకపోతున్నాం. గడచిన 69 ఏళ్లలో మన పప్పు ధాన్యాల సగటు ఉత్పాదకత హెక్టారుకు 441 కిలోల నుంచి 691 కిలోలకు మాత్రమే పెరగగలిగిందంటే మన పరిశోధనలు, వాటి కేటాయింపులు ఎటు పోతున్నట్లు? హరిత విప్లవం కొన్ని పంటలకే, ముఖ్యంగా వరి, గోధుమ వంటి పంటలకే పరిమితమైందనే అపవాదు లేకపోలేదు. సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, కొర్ర, రాగులతోపాటు పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలకు ఆదరణ తగ్గింది. పంటల విస్తీర్ణం క్షీణించడంతోపాటు ప్రజల్లో వాటి వినియోగం సైతం తగ్గడంతో మన ఆహారంలో పోషకాహార స్థాయి పడిపోయింది. అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లాయి. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసింది. హరిత విప్లవంతో సాధించిన ప్రగతి కొన్ని రంగాలకే పరిమితం కాగా, అది తెచ్చిన అనర్థాలు విస్తృతస్థాయిలో నష్టపరచాయి. హరిత విప్లవం తరవాత దేశం ఆహారోత్పత్తుల్లో స్వావలంబన సాధించిన మాట నిజమే కానీ, అదే సమయంలో రైతుల ఆదాయాలూ మరింత క్షీణించాయి. దేశానికి ఆహార ధాన్యాలు అందించే రైతులు ఒకపూట తిండికి నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఆహారభద్రత చట్టం తీసుకొచ్చినా, లక్ష్యాల సాధనకు కీలకమైన అంశాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఎంతసేపూ ఉత్పత్తి-పంపిణీ గురించే తప్ప, ఉత్పత్తి సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రద్ధ పెట్టడం లేదు!
గ్రామస్థాయిలో విస్తరణ యంత్రాంగం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపం. మన అవసరాలెంత, ఎంత పండించాలి, మేరకు పండిస్తే ఎంతెంత ధరలొస్తాయని చెప్పేవారే లేరు. గ్రామీణ రైతు స్థాయికి సాగు సలహాలందడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలూ రైతుకు దక్కడంలేదు. పంట నూర్చినప్పుడు ధరలు పడిపోతాయి. కొద్ది నెలల తరవాత మళ్ళీ పెరుగుతాయి. తెచ్చిన అప్పులు తీర్చేందుకు 80 శాతం రైతులు కల్లాంలోనే పంటను తెగనమ్ముకుంటున్నారు. లాభమంతా వాటిని కొనిపెట్టుకున్న వ్యాపారులకు చేరుతోంది. ఇలా అన్నింటా దోపిడిపర్వంతో దేశంలో అత్యధికశాతం రైతులు అప్పుల వూబిలో కూరుకుపోయారని జాతీయ సర్వేలు తేల్చి చెప్పాయి. ఏడేళ్ల క్రితం 2009-10లో క్వింటా వడ్లు ఉత్పత్తి చేయాలంటే రూ.645 ఖర్చయ్యేది. 2015-16 నాటికది రూ.1,324కు పెరిగింది. నేటికి క్వింటా వడ్లకు మద్దతు ధర రూ.1,410కి మాత్రమే చేరింది. ఇదంతా ప్రభుత్వ లెక్క. వాస్తవ ఖర్చులు ఇంకెంతో ఎక్కువ. విధంగా చూసినా చూసినా ఖర్చుకు, ఆదాయానికి పెద్ద వ్యత్యాసం లేదన్న సంగతి సుస్పష్టం. కొన్ని పంటల సాగులో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, అవే పంట ఉత్పత్తుల్ని సొంత అవసరాలకోసం చిన్నచిన్న దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడటం దారుణం. పరిస్థితుల్లో ఉత్పత్తులు పెంచడంతోపాటు, వాటికి విలువ జోడించడమూ అత్యంత కీలకం. అందుకు తగిన అవకాశాలను కల్పించాల్సి ఉంది. దిశగా రైతుల వద్దకు వెళ్లి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నారు. రాష్ట్రాలవారీగా వివిధ పంటల్ని అధికంగా పండించే ప్రాంతాలను గుర్తించి, వాటిని క్లస్టరుగా విభజించి విలువ జోడింపు పరిశ్రమలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఏర్పాటయ్యేలా చూడాలి. ఇటీవలి కాలంలో విద్యాధికులు కొత్తగా సేద్యంలోకి దిగుతున్నారు. కానీ, వీరి సంఖ్య స్వల్పమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేద్యం పట్ల మమకారం పెరగాలంటే వ్యవసాయ సంస్కరణలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతులు నిలదొక్కుకునేందుకు అవి దోహదపడాలి. పాలకుల మాటలు చేతలుగా రూపాంతరం చెందితేనే ఫలితం ఉంటుంది.

పంట నష్టపోతే పాడి ఆదుకుంటుంది. కవ్వమాడిన ఇంట కాసులకు లోటుండదనే నానుడిని నేడు రైతులోకం విస్మరిస్తోంది. దీనికి పాలకులూ బాధ్యులే. స్వాతంత్య్రానంతరం నీలి విప్లవం సాధించాం, శ్వేత విప్లవం ఫలితాలనూ అందుకున్నాం. పాల ఉత్పత్తి 1990-91లో 5.39 కోట్ల టన్నుల నుంచి 2014-15నాటికి 14.63 కోట్ల టన్నులకు చేరింది. మేలుజాతి పశుపోషణ రైతులకు భారంగా పరిణమించింది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ, సగటు ఉత్పాదకతలో ఇజ్రాయెల్‌, బ్రెజిల్వంటి దేశాలతో పోల్చితే ఇండియా అట్టడుగున ఉంది. రోజుకు 50 లీటర్లకు పైగా పాలిచ్చే జాతులతో దేశాలు సుసంపన్నం అవుతుంటే భారత్లో 25 లీటర్ల స్థాయినైనా అందుకోలేకపోతున్నారు. పాల సగటు ఉత్పాదకత పెరిగే కొద్దీ రైతుకు పశుపోషణ లాభసాటిగా మారుతుంది. చేపలు, కోళ్లు, పట్టు, తేనెటీగలు, జీవాల పెంపకం.. ఇలా సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తే అన్నదాతలు సేద్యాన్ని వదలివెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాదు.

దృక్పథం మారాలిక... 
స్వాతంత్య్రానంతరం తొలి పంచవర్ష ప్రణాళిక తరవాత ప్రభుత్వాలకు ప్రాథమ్యాలు మారిపోయాయి. సేద్యరంగంపై శ్రద్ధ కొరవడిన ఫలితమే ఇదంతా! ఏటా బడ్జెట్లలో వ్యవసాయరంగానికి కేటాయింపులు తగ్గుతున్న కొద్దీ పరిశోధనలు మరింత దిగజారాయి. కరవు కాలంలో ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. విపత్తు నష్టాలను కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన అవసరముంది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం 10 శాతం కేటాయింపులుండాలి. అత్యధికులు ఆధారపడిన సేద్యరంగానికి సంస్కరణలతో వూపిరులూదాలి. ప్రభుత్వాల దృష్టికోణం మారాలి. మరో హరిత విప్లవం సాధించే దిశగా కార్యాచరణ అమలు కావడం నేడెంతో ముఖ్యం. పంట ఉత్పత్తులు, విలువ జోడింపు ఉత్పత్తులతో వ్యవసాయ వాణిజ్యం బహుముఖీనంగా విస్తరిస్తున్న కొద్దీ మన రైతులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా వారిని కార్యోన్ముఖుల్ని చేయాలి. ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వాలే మద్దతు ధరలిచ్చి రైతులనుంచి నేరుగా పంటను కొనేలా సంస్కరణలు అమలులోకి తేవాలి. నిస్సారమైన నేలలకు జవసత్వాలు కల్పించే కృషి ముమ్మరం కావాలి. ఉత్పత్తుల్ని రెట్టింపు చేసే వంగడాలు గ్రామస్థాయి రైతులకు అందుబాటులోకి రావాలి. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక హంగులు అద్దేలా గ్రామీణ రైతుల్ని తీర్చిదిద్దేందుకు విస్తరణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. వీటికితోడు పశుపోషణ తప్పనిసరి వ్యాపకంగా చేపడితే, పంట కోల్పోయినా రైతుల్ని పాడి ఆదుకుంటుంది. దిశగా పాలకులు విస్తృత ప్రచారంతో పాటు డెయిరీ రంగానికి ఇతోధిక తోడ్పాటు అందించాలి. సేద్యంతో పాటు అనుబంధ రంగాలను రైతులు జోడు గుర్రాల్లాగా స్వీకరించిన నాడే వ్యవసాయరంగం మళ్ళీ సిరిసంపదలతో తులతూగుతుంది. రైతు ముంగిళ్లు పాడిపంటలతో, ధాన్యరాశులతో విలసిల్లుతాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి