16, ఆగస్టు 2016, మంగళవారం

గ్రామసీమలకు విద్యుత్‌ తోరణాలు

హేతుబద్ధ ధరే కీలకావసరం 
మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఎల్‌ఈడీ బల్బుల వాడకం ద్వారా పెద్దయెత్తున విద్యుత్తు పొదుపు చేయవచ్చని దేశ ప్రజలకు హితవు చెప్పారు. అందువల్ల రూ.1.25లక్షల కోట్ల విలువైన విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. వెయ్యి రోజుల్లో చీకట్లో మగ్గుతున్న 18 వేల గ్రామాలకు విద్యుత్‌ వెలుగులు ప్రసరింపజేస్తామని నిరుటి స్వాతంత్య్రం దినోత్సవ సందేశం సందర్భంగా తాను ఇచ్చిన హామీని ప్రధాని ఈసారీ ప్రస్తావించారు. లక్ష్యసాధన దిశలో సర్కారు వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం- ఏడాది వ్యవధిలోనే అందులో సగం- అంటే, తొమ్మిది వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. రాబోయే డిసెంబరుకల్లా మిగిలిన గ్రామాలకూ విద్యుత్‌ ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా వేల గ్రామాలు చీకట్లో మగ్గిపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రధాని మోదీ, దేశంలో విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టడానికి స్థిర సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. విద్యుత్‌ కొరత నుంచి మిగులు దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో అందరికీ విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరం. కేంద్రం దీన్నో సవాలుగా స్వీకరించింది. రాష్ట్రాలనూ ఆ దిశలో అడుగులు వేయిస్తోంది. 2022నాటికి ‘అందరికీ విద్యుత్‌’ కేంద్రం నినాదం. అదే ఇప్పుడు విధానం కావాల్సి ఉంది!
ఇంటింటా వెలుగులు 
నిరుడు ఏప్రిల్‌ నాటికి దేశంలో 18,452 గ్రామాలకు విద్యుత్‌ వసతి లేదని కేంద్రం గుర్తించింది. ఒడిశా, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి 19 రాష్ట్రాల్లో ఇటువంటి గ్రామాలు అధికంగా ఉన్నాయి. వేలాది నక్సల్స్‌ ప్రభావిత గ్రామాలు విద్యుత్తుకు నోచుకోలేదు. అలాంటి గ్రామాలు దేశంలో ఏడు వేల వరకూ ఉన్నాయి. ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఇవి చాలా ఎక్కువ. విద్యుత్‌ వసతి లేని గ్రామాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటన్నింటికీ విద్యుత్‌ అందించే విషయమై లక్ష్యాలు నిర్దేశించి, వాటిపై ఒత్తిడి పెంచుతోంది. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం ప్రత్యేకంగా సమీక్షిస్తోంది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద ఇచ్చే నిధుల్లో కేంద్రం సింహభాగం ఇందుకే ఇస్తోంది. దీన్‌దయాళ్‌ పథకం కింద కేంద్రం రూ.42 వేలకోట్లు మంజూరు చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్‌కు అందేది 944 కోట్ల రూపాయలే. తెలంగాణకు కేవలం 462 కోట్ల రూపాయలే. ఏడాది చివరినాటికి నిర్దేశించిన అన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాల్సిందేనంటూ జూన్‌లో గోవాలో జరిగిన విద్యుత్‌ మంత్రుల సమావేశంలో ప్రత్యేక తీర్మానం సైతం చేశారు. తీర్మానానికే పరిమితం కాకుండా బాధ్యతను గుర్తు చేస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు సైతం రాసింది. గ్రామాలకు విద్యుత్‌ ఇవ్వడంతోపాటు, వాటిలోని వంద శాతం ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడమూ ముఖ్యమే. 2017 మే నాటికి లక్ష్యాన్ని చేరాలన్నది కేంద్ర సంకల్పం.

దేశంలో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు వంద శాతం గ్రామాలకు విద్యుదీకరణ కల్పించిన జాబితాలో చేరాయి. ఇంటింటికీ విద్యుత్‌ అందించే దిశగా ఈ రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. వంద శాతం ఇళ్లకు విద్యుత్‌ అందించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ వంటివి ఇప్పటికే చేరాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనలో కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు కేంద్రం నిధులు అందిస్తోంది. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకానికి ఇది కొనసాగింపు. నిరంతర విద్యుత్‌ సరఫరా మోదీ సర్కారు మరో సంకల్పం. ఈ ఆశయ సాధనకు కేంద్రం ఇప్పటికే 15 రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంది. నిరంతరం విద్యుత్‌ అందించాలంటే బహుముఖ వ్యూహం అవసరం. గిరాకీకి అనుగుణంగా విద్యుత్‌ ఉత్పాదన పెరగాలి. సరఫరా, పంపిణీ వ్యవస్థలను నెలకొల్పాలి. విద్యుత్‌ను ప్రజలకు అందించే పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఇది జరగాలంటే సంస్థల నష్టాలు తగ్గి ఆదాయం పెరగాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడివడిన అంశాలు. ఈ రంగాలు అన్నింటినీ కేంద్రం స్పృశిస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందాలంటే విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టత కలిగి ఉండాలి. కానీ, దేశంలోని పంపిణీ సంస్థలు నష్టాలతో కునారిల్లుతున్నాయి. ఆ దుస్థితి నుంచి వీటిని గట్టెక్కించడానికి కేంద్రం ‘ఉదయ్‌’ పథకం ప్రవేశపెట్టింది. కానీ, ఇంధన ధరలకు అనుగుణంగా మూడు నెలలకొకసారీ విద్యుత్‌ ఛార్జీలను సవరించాలన్న షరతుల అమలు వినియోగదారుడికి భారంగా పరిణమించే అవకాశముంది. ఇలాంటి షరతుల కారణంగానే తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇంకా ‘ఉదయ్‌’లో చేరలేదు. ఓ అంచనా ప్రకారం తమిళనాడు విద్యుత్‌ సంస్థల ఆర్థిక నష్టాలు రూ.65 వేలకోట్లపైనే ఉన్నాయి.
పారదర్శకతకు పెద్దపీట
గ్రామీణ భారతంలో 16.78 కోట్ల ఇళ్లు ఉన్నాయని 2011నాటి జనగణన అంచనా. అందులో 55.3 శాతానికే అప్పటికి విద్యుత్‌ సౌకర్యముంది. పట్టణ ప్రాంతాల్లో 7.88 కోట్ల ఇళ్లు ఉంటే, 92.67 శాతానికి విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్నట్లు ఆనాటి జనాభా గణనలో వెల్లడైంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యుత్తుకు నోచుకోని గ్రామాల సంఖ్య ఎక్కువ అని ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఇంటికీ విద్యుత్‌ ఇవ్వడంలో భాగంగానే 2012 నుంచీ ఇప్పటివరకు 53.26 లక్షల కొత్త విద్యుత్‌ కనెక్షన్లను కేంద్రం విడుదల చేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇందుకు నిధులు ఇస్తూ వచ్చింది. దేశంలో విద్యుత్‌ కనెక్షన్‌ లేని ఇల్లు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కేంద్రం చేయూత ఇస్తోంది. నిధుల వినియోగం తీరుతెన్నులను తెలుసుకొనేందుకు ఇచ్చిన కొత్త విద్యుత్‌ కనెక్షన్ల వివరాలను అంతర్జాలంలో పెట్టాలని రాష్ట్రాలను కోరింది. పారదర్శకతకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ నిర్ణయమే దాఖలా!
పథకాలు ఏవైనా సంస్థల శ్రేయం, వినియోగదారుల సంక్షేమాలకు కట్టుబడి ఉండాలి. చిత్తశుద్ధితో కొన్ని చర్యలు తీసుకోగలిగితే ఛార్జీల పెరుగుదలనూ నియంత్రించవచ్చన్న అభిప్రాయమూ ఉంది. విదేశీ బొగ్గు ధర ఎక్కువ. అదే సమయంలో స్వదేశంలో బొగ్గు పుష్కలంగా ఉంది. దీంతో విదేశీ బొగ్గు దిగుమతి తగ్గింది. అంతకుముందుకన్నా గత ఆర్థిక సంవత్సరం తొంభై లక్షల టన్నుల మేర బొగ్గు దిగుమతి తగ్గింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతోంది. దీనివల్ల జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) విద్యుత్‌ ధర తగ్గినట్లు ఓ విశ్లేషణలో వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య ఎన్టీపీసీ సరఫరా చేసిన విద్యుత్‌ యూనిట్‌ సరాసరి ధర రూ.3.04. అంతకుముందు ఇదే సమయంలో యూనిట్‌ రేటు సరాసరిన రూ.3.19 ఉన్నట్లు ఆ విశ్లేషణలో తేలింది. రాష్ట్రాలు ఎన్టీపీసీని మార్గదర్శిగా తీసుకోవాలి. దేశ విద్యుత్‌ అవసరాలు 60 శాతంపైగా బొగ్గు ఆధారిత ప్రాజెక్టుల ద్వారానే తీరుతున్నాయి. కాబట్టి, విద్యుత్‌ ఉత్పత్తి వ్యయ నియంత్రణ ప్రభావం వినియోగదారుడికి అందించే విద్యుత్‌ ధరపై ఉంటుంది. స్వదేశంలో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం, అంతకుముందు ఏడాది కంటే మూడు కోట్ల టన్నుల బొగ్గును దేశం అధికంగా సరఫరా చేయగలిగింది. థర్మల్‌ స్టేషన్లకు బొగ్గు కొరత ఇక గత చరిత్రే. ఇకనైనా కమిషన్లకు కక్కుర్తిపడి బొగ్గు దిగుమతికి ద్వారాలు తెరువరాదు. దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఏటికేడాది పెరుగుతోంది. 2022నాటికి 175 గిగావాట్లను సాధించాలన్నది కేంద్ర లక్ష్యమన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేశంలో మెగా సౌర పార్కుల అభివృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సౌర విద్యుత్‌ సామర్థ్యం మరో ఏడెనిమిది వేల మెగావాట్లు పెరగవచ్చని అంచనా. కేంద్రం కూడా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగ వాటాను పెంచింది.
మిగులు దిశగా అడుగులు 
కేంద్ర తాజా నిర్దేశం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 11.50 శాతం కలిగి ఉండాలి. అంతకుముందు ఈ వాటా కేవలం అయిదు శాతమే. 2019 మార్చినాటికి రాష్ట్రాల పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 17 శాతం ఉండాలని కేంద్ర నిర్ణయం తెలియజేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ వనరుల వినియోగ పెరుగుదలను కేంద్ర నిర్ణయం తెలియజేస్తోంది. అందుకే పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించుకునేలా సరఫరా వ్యవస్థలను రూపొందించుకోవడం సవాలుగా మారింది. సౌర విద్యుత్‌ పగలు లభిస్తుంది. ఆ సమయంలో థర్మల్‌ విద్యుత్‌ను తగ్గించుకోవాలి. మళ్ళీ సౌర విద్యుత్‌ తగ్గినప్పుడు థర్మల్‌ విద్యుత్‌ను పెంచుకోవాలి. పునరుత్పాదక విద్యుత్‌ను తప్పనిసరిగా వాడుకోవాలి. ఒప్పందంలోనే ఈ నిబంధన ఉంటుంది. విద్యుత్‌ మిగులు ఉంది కాబట్టి సౌర యూనిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయమని చెప్పలేరు. అందుకే థర్మల్‌ యూనిట్లను తాత్కాలికంగా నిలిపివేయడం తప్పకపోవచ్చు. ఇంధనం- బొగ్గు ఉండి ఒక యూనిట్‌ను నిలిపివేయడమంటే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే. నిరర్ధక ఆస్తిగా తయారు చేయడమే. ఉత్పత్తికి అనుగుణంగా గిరాకీ పెరగకపోతే ఈ పరిస్థితి రాదని చెప్పలేం. గత ఆర్థిక సంవత్సరం రెండు శాతం విద్యుత్‌ లోటును దేశం ఎదుర్కొంది. ప్రస్తుతం మిగులు ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. లోటు ఉన్న రాష్ట్రాలకు విద్యుత్‌ ఇవ్వడానికి విపణిని సృష్టించింది. ఒకరోజు ముందు అడిగే పద్ధతిలో ఈ విద్యుత్‌ విపణి నడుస్తోంది. ఎన్టీపీసీ కూడా ఈ విపణిలో చేరింది. తమ ప్రాజెక్టుల్లో ఎవరూ (ఏ రాష్ట్రమూ) అడగని విద్యుత్‌ను మార్కెట్‌కు ఇచ్చేందుకు మహారాష్ట్ర ముందుకు వచ్చింది. విద్యుత్‌ మార్కెట్‌పై పూర్తిస్థాయిలో ఆధారపడకపోయినా, అందుబాటును అది పెంచింది. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు విద్యుత్‌ను కొనుక్కోవడానికి వెసులుబాటు వచ్చింది. దీంతో లోటును అధిగమించడానికి ఓ అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శక పద్ధతిలో జరుగుతోంది. తెరవెనక లావాదేవీలు లేకుంటే ధర హేతుబద్ధంగా ఉండే అవకాశముంది. వినియోగదారులందరికీ సరసమైన ధరలో విద్యుత్‌ను అందించగలిగతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం నేరవేరినట్లే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి