11, సెప్టెంబర్ 2016, ఆదివారం

కరివేపాకు సాగుతో కాసుల పంట

  • మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మరిన్ని అద్భుతాలు

కరువుతో సతమతమవుతున్న రైతును కరివేపాకు సాగు ఆదుకుంటోంది. కడపజిల్లా జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడులో 350 ఎకరాల్లో రైతులు కరివేపాకు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆరుగాలపు కష్టం దళారుల పాలుకాకుండా ఉంటుందని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.


ప్రభుత్వంనుంచి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుని సాధించుకోవాలంటే రైతులు సంఘటితమై కలిసికట్టుగా నడవాల్సిందే.
- ‘రైతు స్వరాజ్య వేదిక’ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్‌ కుమార్‌ విస్సా. 


కడపజిల్లా ఎస్‌.ఉప్పలపాడు రైతులు కొన్నేళ్లుగా పత్తి, శనగ తదితర పంటలు సాగుచేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పంటలు చేతికందక నష్టాలపాలవుతున్నారు. మరోవైపు సాగు పెట్టుబడి గణనీయంగా పెరిగి, దిగుబడి నామమాత్రమై అప్పుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో గురప్ప అనంతపురంజిల్లాలోని బంధువుల గ్రామానికి వెళ్లి కరివేపాకు సాగుగురించి తెలుసుకున్నాడు. దశాబ్దాలుగా సాగుచేస్తున్న పంటలతో నష్టపోతున్నందున కొత్త పంటవైపు మొగ్గుదామనుకున్నాడు ఆ రెతు. అలా గురప్ప తొలిసారి గ్రామంలో కరివేపాకు సాగుకు శ్రీకారంచుట్టారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంచి లాభాలు గడించడంతో ఇతర రైతులు కూడా కరివేపాకు సాగు చేపట్టి నష్టాలనుంచి గట్టెక్కారు. ప్రస్తుతం ఉప్పలపాడులో 350 ఎకరాల మేర కరివేపాకు సాగవుతుండటం విశేషం.

ధరలో హెచ్చుతగ్గులు
కరివేపాకు సాగుకు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రైతులు విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఎకరాకు 90 కిలోలదాకా విత్తనం కావాలి. ఇందుకోసం రూ.70 వేలు ఖర్చవుతుంది. ఒకసారి విత్తనం వేస్తే నేల స్వభావాన్ని బట్టి రెండుమూడేళ్లకుపైగా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎకరాకు 5 ప్యాకెట్ల ఫాస్పేట్‌ వాడాల్సి వస్తుందని, ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారు. చీడపీడల నివారణకు పది రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. నాలుగు నెలలకు ఒక కోత వంతున ఎకరాకు 6టన్నుల దిగుబడి వస్తుంది. దిగుబడి బాగుంటే 10 టన్నులు కూడా వస్తుంది. ఆకును నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్తే రైతుకు మంచి లాభం వస్తుంది. కానీ, ఎక్కడికి తీసుకెళ్లాలో రైతులకు తెలియకపోవడంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వ్యాపారులు కొందరు పొలం దగ్గరకే వచ్చి కిలోల వంతున కరివేపాకు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.2 వస్తుండగా డిసెంబరు ప్రాంతంలో రూ.15-20దాకా లభిస్తుంది. ఖర్చులుపోగా ఏటా ఎకరానికి రూ.50వేల నుంచి లక్షవరకు ఆదాయం పొందిన రైతులు కూడా ఉన్నారు. ‘‘మా పంటను తక్కువ ధరకు కొని వ్యాపారులు ప్రధాన నగరాల్లో అమ్మి మంచి లాభాలు గడిస్తున్నారని తెలుసు. కానీ, ఏం చేయాలో తెలియక వచ్చినదానితో సరిపెట్టుకుంటున్నాం’’ అంటున్నాడు గురప్ప.

ప్రభుత్వ సహకారంతో మరింత సాగు

ఈ ప్రాంతంలో వందలాది రైతులు కరివేపాకు సాగు చేస్తున్నా దీనికి సంబంధించిన ఉద్యానశాఖ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే గతంలో దీన్ని సాగు చేసిన రైతుల సలహాలతోనే నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తున్నదని వారు చెప్పారు. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తే మెరుగైన దిగుబడులు సాధిస్తామని రైతులు చెబుతున్నారు. కరివేపాకు పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మేం పడిన కష్టం దళారుల పాలు కాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పంట సాగుకు రుణ సౌకర్యం, బీమా లాంటివి కల్పిస్తే మరింత స్థాయిలో కరివేపాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- ఆంధ్రజ్యోతి, ప్రొద్దుటూరు 

మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
కరివేపాకు సాగు లాభదాయకంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఈ పంటను సాగు చేయడంలేదు. ఎక్కువ ఖర్చుండదు. టెన్షన్‌ ఉండదు. ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించగలిగితే రైతులకు మరింత ఆదాయం చేకూరుతుంది. మార్కెట్లో ఉన్న రేటు మాకు తెలియడంలేదు. వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చేస్తు న్నాం. కానీ, వారు అధిక ధర లభించే ప్రాంతాల్లో విక్ర యిస్తూ లాభాలు గడిస్తున్నారు. 

- కృష్ణ, ఉప్పలపాడు


ప్రభుత్వ మద్దతు కావాలి 
మేం సాగు చేసిన పంటను అధికారులు పరిశీలించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే మరింత దిగుబడి సాధిస్తాం. ఈ పంట సాగుకు రుణ సౌకర్యంతోపాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే ఏ అధికారిని కలువాలనో కూడా మాకు తెలియడంలేదు. ఈ పంట సాగు చేసిన పక్క రైతులను అడిగి వారు చెప్పిన మందును పిచికారీ చేస్తున్నాం. 

- హరి, ఎస్‌.ఉప్పలపాడు
మూలం: ఆంధ్రజ్యోతి

22, ఆగస్టు 2016, సోమవారం

51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్థిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిన 51గ్రామాలు, ఆ రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. ఈ విజయాలన్నీ ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్‌ ఒరేన్‌ అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.

‘నేను పురస్కారాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పల్లెల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించాలి’... తనకు దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించినప్పుడు సైమన్‌ అన్న మాటలివి. దిల్లీలో పురస్కారం అందుకోవడానికి వచ్చిన ప్రముఖల కోసం ఫైవ్‌ స్టార్‌ హోటల్లో గదులని కేటాయిస్తే, వాటిని వద్దని ఓ గిరిజన సంక్షేమ హాస్టల్లో బస చేశాడు సైమన్‌. ‘నా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే, నేను విలాసాలను అనుభవించలేను’ అన్నది ఆయనిచ్చిన సమాధానం. జార్ఖండ్‌లోని బీడో జిల్లా కక్సిటోలి గ్రామంలో పుట్టిన సైమన్‌, రాష్ట్రపతి భవనం దాకా రావడానికి మధ్యలో మార్చిన జీవితాలూ, సాధించిన విజయాలూ చాలా ఉన్నాయి.

నీటి కష్టాలు మొదలు... 
సైమన్‌ స్వగ్రామం ఓ అటవీ ప్రాంతం. చిన్నప్పుడు దళారులు యంత్రాలతో చెట్లను నరుకుతుంటే చూడ్డానికి సైమన్‌ సరదా పడేవాడు. అంత భారీ యంత్రాలు ఒక్క దెబ్బకు చెట్లను నేలకూల్చడం అతడికి ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త పెద్దయ్యాక కానీ అతడికి అర్థం కాలేదు, ఆ దళారులు నాశనం చేస్తోంది అడవుల్ని కాదు తమ జీవితాల్నీ అని. చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ఆ ప్రాంతంలో నేలపైన సారవంతమైన పైపొర కొట్టుకుపోయి, భూములన్నీ నిస్సారంగా మారాయి. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైంది. నెమ్మదిగా వలసలూ, ఆకలి చావులూ, ఆత్మహత్యలూ మొదలయ్యాయి. దైవంలా చూసుకునే అడవిలోని చెట్లని కొట్టి అమ్ముకొని గ్రామస్థులు పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సైమన్‌ ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అన్ని ఇబ్బందులకూ కారణం నీటి కరవే. వర్షాకాలంలో కురిసే వానలే అక్కడ నీళ్లకు ఆధారం. వాటిని భద్రపరచుకోగలిగితే నీటి కొరతను కొంత వరకూ జయించొచ్చని అనుకున్నాడు. 

కష్టాలకు ‘చెక్‌’డ్యామ్‌లు... 
వానాకాలంలో నీటిపాయలు కొండల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయేవి. సైమన్‌ ఆ నీటిధార ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి కొన్ని మైళ్ల దూరం నడిచాడు. వర్షపు నీళ్లు అడవిలో, కొండలపైన ఎక్కువగా నిలుస్తోన్న ప్రాంతాలను గుర్తించాడు. వాటి పరిసరాల్లో చెక్‌ డ్యామ్‌లు నిర్మించి, ఆ నీటిని కుంటల్లోకీ, పొలాల్లోకీ మళ్లిస్తే నీటి సమస్య తగ్గుతుంది అనిపించింది. కానీ దానికోసం గ్రామస్థుల పొలాల్లో కొంత భాగం మునిగిపోతుంది. దాంతో చాలామంది డ్యామ్‌ల నిర్మాణానికి ఒప్పుకోకపోవడంతో, సైమన్‌ తన పదెకరాల పొలాన్నీ ముంపు బాధిత రైతులకు ఇచ్చేశాడు. కొందరు కుర్రాళ్ల సాయంతో వర్షపు నీటి ప్రవాహాలకు అడ్డంగా మట్టితో చెక్‌ డ్యామ్‌లు నిర్మించి ఆ నీటిని బావులవైపు మళ్లించాడు. తొలి రెండేళ్లూ వర్షాల ధాటికి ఆ డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దాంతో మూడో ఏడాదికి అధికారుల కాళ్లావేళ్లా పడి కాంక్రీట్‌ డ్యామ్‌లు నిర్మించాడు. వాటి ఆధారంగా గ్రామ చుట్టుపక్కలున్న బావులూ కుంటల్లోకి వర్షపు నీరు చేరేలా కాల్వలు ఏర్పాటు చేశాడు. కొత్తగా చెరువులు తవ్వించాడు. క్రమంగా భూగర్భ జల మట్టం పెరిగింది. పొలాలు వ్యవసాయానికి అనువుగా మారాయి. ఆ విజయం ఇతర గ్రామాలనూ ఆకర్షించి వాళ్లూ సైమన్‌ను ఆశ్రయించారు. అలా ఒక్కో గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టిన సైమన్‌, కొన్నేళ్ల వ్యవధిలో ఆ జిల్లాలోని 51 గ్రామాల్లో నీటి కరవును దూరం చేశాడు.గ్రామాలు మారిపోయాయి 
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమేనని సైమన్‌కి తెలుసు. అందుకే కుర్రాళ్లను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశాడు. గతంలో చెట్లను నరికేసిన ప్రాంతంలో 35వేలకు పైగా చెట్లను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఫలితంగా నేల సారవంతమైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్‌ పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్‌ వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంటే వేస్తే, ఈ 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితో సహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఆత్మహత్యలూ, వలసలూ తగ్గి చాలా కాలమైంది. తొలిసారి పిల్లలు మంచి స్కూళ్లకెళ్లి చదువుకుంటున్నారు. ఈ గ్రామాల నుంచి లక్షలు విలువ చేసే 20వేల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఏటా గుజరాత్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో బీడోని అక్కడి ప్రభుత్వం ‘అగ్రికల్చరల్‌ హబ్‌ ఆఫ్‌ జార్ఖండ్‌’గా గుర్తించింది. సైమన్‌ను వాటర్‌ షెడ్ల కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. అతడి ప్రస్థానంపైన సారా అనే కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిని పీహెచ్‌డీ చేసింది. వృద్ధాప్యం మీదపడినా ఇప్పటికీ సైమన్‌ ఏటా వెయ్యి మొక్కలను నాటడంతో పాటు వాటి బాగోగులనూ చూసుకుంటున్నాడు

సైమన్‌లా ఇబ్బందులు ఎదుర్కొన్నాక పరిష్కారాన్ని వెతుకుతామా, లేక అజాగ్రత్త వల్ల ఎదురయ్యే సమస్యలను ముందే వూహించి వాటిని నివారించడానికి మనవంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తామా అన్నది మన చేతుల్లో పనే కదా..!